BRS
BRS: ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. టికెట్ రాక కొందరు, వస్తుందో రాదో తెలియక మరికొందరు మండిపడుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల ‘టికెట్ ఫైట్’ కొనసాగుతోంది. తమ స్థానాలను ఆశిస్తున్న వారిపై సిటింగ్ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. జనగామ, నర్సాపూర్, ములుగు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల అసంతృప్తి, అసమ్మతితో రాజకీయం రసకందాయంలో పడింది. జనగామ బీఆర్‌ఎస్ టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడుతున్నారు. సాయం చేసే గుణమే లేని పల్లా జనగామలో ఎలా ప్రజాసేవ చేస్తారని ప్రశ్నిస్తున్నారు.” కార్యకర్తలు, ప్రజలకు సమయం ఇవ్వని, సహాయం చేయని పల్లా అక్రమ సంపాదనతో పరిచయాల పేరిట నాయకులను కొనుగోలు చేస్తూ నియోజకవర్గాన్ని కకావికలం చేస్తున్నారని” ఆరోపిస్తున్నారు. _సిటింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పల్లా జనగామపై కక్కుర్తి పడటం ఏంటి?, తెలంగాణ ఉద్యమంలో పల్లా ఎక్కడ ఉన్నారు? ఎన్ని లాఠీదెబ్బలు తిని కేసుల పాలయ్యారో చెప్పాలి?, తెలంగాణ సుస్థిరత కోసం సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నేతలను బీఆర్‌ఎస్ లో చేర్చుకుంటే పల్లా అధికార, డబ్బు మదంతో వారిని కుక్కలతో పోల్చుతున్నారు. నేను కబ్జాలు చేశానని నిరూపిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమని” ముత్తిరెడ్డి సవాల్ విసురుతున్నారు.
నర్సాపూర్ టికెట్ నాకే
మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్‌ఎస్ టికెట్ తనకే ఇవ్వాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీ క్యాడర్ తన వెంటే ఉన్నారని చెబుతున్నారు.”ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి నర్సాపూర్‌కు మాత్రమే ప్రకటించకపోవడం వెనక కారణాలు నాకు తెలియవు. టికెట్ మాత్రం నాకే ఇస్తారు. సునీతారెడ్డిని ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా పర్వాలేదు. కానీ నర్సాపూర్ టికెట్ మాత్రం నాకే ఇవ్వాలి. సునీతారెడ్డికి ప్రస్తుతం క్యాబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవి ఉందని, ఆమె ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తగదని” మదన్ అంటున్నారు.
బీఆర్‌ఎస్ కు సహకరించేది లేదు
ములుగు బీఆర్‌ఎస్ లో అసమ్మతి పెరుగుతోంది. పార్టీపై సీనియర్ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందనాయక్ అసంతృప్తితో ఉన్నారు. ‘పార్టీ కోసం జీవితాన్ని ధారపోశా.. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదులుకున్నా.. కానీ, నాకు పార్టీ చేసిందేమీ లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల గెలుపు కోసం కాళ్లరిగేలా పనిచేసినా గుర్తింపులేదు.. ఈసారి ములుగు టిక్కెట్ ఇస్తారని ఆశపెట్టుకుంటే పట్టించుకోకుండా అవమానించారు..’ అని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అధిష్ఠానం, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవిత వెళ్లి బుజ్జగించారు. ఆయన మంత్రుల ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు. 2018లో సీఎంను కలిసిన సందర్భంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాటిచ్చి ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిని ఏకపక్ష నిర్ణయంతో ప్రకటించారని, తాను ఆమెకు సహకరించబోనని తేల్చిచెప్పారు. ఆయనను సముదాయించిన మంత్రులు త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ వద్దకు తీసుకెళ్తామని, ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవి అడుగుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లోపు హామీ ఇవ్వాలని, లేదంటే తాను బీఆర్‌ఎస్ అభ్యర్థి కోసం పనిచేయనని ఖరాకండిగా చెబుతున్నారు.
జగదీశ్ రెడ్డి వర్సెస్ డీసీఎంఎస్ చైర్మన్
మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆయన ప్రధాన అనుచరుల్లో ఒకరైన డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ ఇటీవల అసమ్మతిగళం వినిపించారు. అనంతరం ఆయనపై అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉంటే.. జానయ్యయాదవ్ కనిపించడం లేదని ఆయన భార్య రేణుక సోమవారం హైదరాబాద్‌లో మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డితో ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, జానయ్యయాదవ్ ప్రధాన అనుచరుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు పిల్లలమర్రి ఉపేందర్‌ను చివ్వెల మండలంలో ఓ చెరువు లూటీ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. జానయ్య యాదవ్‌ను అణచివేసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్య వేదిక విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.