KCR Kaleshwaram Commission: ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలకు సొంతంగా సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయి. వీటిలో అధికారికంగా చాలానే నడుస్తున్నాయి. ఈ సోషల్ మీడియా గ్రూపుల అసలు ఉద్దేశం ప్రత్యర్థులపై దుమ్మెత్తి పోయడం.. తర్కంతో సంబంధం లేకుండా విమర్శలు చేయడం.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం.. జనాల ముందు పలచన చేయడం వీటి ప్రధాన ఉద్దేశాలు. ఈ సోషల్ మీడియా గ్రూపుల నిర్వహణ కోసం రాజకీయ పార్టీలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని సంబంధం లేకుండా అన్ని కూడా బీభత్సంగా ఖర్చు చేస్తున్నాయి. సోషల్ మీడియా గ్రూపులలో పనిచేయడానికి ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకొని.. ఎడిట్ వీడియోలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయితే గతంలో ఈ పని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎక్కువగా చేసేది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అది అనుసరించిన దారిని మిగతా పార్టీలు పాటిస్తున్నాయనే విమర్శలున్నాయి.
తాజాగా కాళేశ్వరం ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో వన్ టూ వన్ విచారణ సాగింది. విచారణ సాగుతున్న సమయంలో బిఆర్కె భవన్ ఎదుటకు గులాబీ నాయకులు భారీగా వచ్చారు. కెసిఆర్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విచారణ పూర్తయిన తర్వాత కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. అయితే విచారణ తర్వాత కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారా? విచారణలో కేసీఆర్ ఇబ్బంది పడ్డారా? అంటే ఈ ప్రశ్నలకు అవును అని కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెబుతున్నాయి. అంతేకాదు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో విచారణ తర్వాత కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఎడిట్ వీడియో పోస్ట్ చేశాయి. రజనీకాంత్ నటించిన శివాజీ సినిమాలో ఓ సన్నివేశాన్ని.. కెసిఆర్ ఎదుర్కొన్న విచారణ సందర్భాన్ని ముడి పెడుతూ వీడియోను రూపొందించాయి. ఇటీవల మాగంటి గోపీనాథ్ చనిపోయినప్పుడు కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని.. విచారణ అనంతరం తిరిగి వెళుతున్న దృశ్యాన్ని జతచేసి వీడియో రూపొందించాయి. అంతేకాదు విచారణ తర్వాత కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారని ప్రచారానికి దిగాయి. ఈ వీడియో చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. జూన్ పెట్టి చూస్తే మాత్రం అదంతా కల్పిత వీడియో అని అర్థమవుతుంది. అయితే దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకున్నది.. ఎలాంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనుకున్నది.. బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. ఇలాంటి వాటి ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని విషయాన్ని మాత్రం గుర్తించడం లేదు. అలాగని భారత రాష్ట్ర సమితి సుద్దపూస కాదు. అది కూడా గతంలో ఇలాంటి వీడియోలు చాలా చేసింది. ఇప్పుడు బాధిత పక్షంగా ఉంది.
కాళేశ్వరం విచారణ తర్వాత దొరవారి పరిస్థితి pic.twitter.com/o1Up3CswEu
— Aapanna Hastham (@AapannaHastham) June 11, 2025