Kavitha vs Harish Rao: ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యులదే హవా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలలో కుటుంబ సభ్యుల పెత్తనమే మరింత ఎక్కువగా సాగుతూ ఉంటుంది. దీనికి ఏ పార్టీ కూడా మినహాయింపు కాదు. పార్టీని ఒక వ్యక్తి స్థాపిస్తే.. అతని కుటుంబ సభ్యులు వారసత్వంగా నడిపిస్తూ ఉంటారు.. తెలుగుదేశం నుంచి మొదలుపెడితే భారత రాష్ట్ర సమితి వరకు ఇదే కొనసాగుతోంది. కాకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుది పెత్తనం కాబట్టి, సీనియర్ ఎన్టీఆర్ వారసులు అంతగా అందులో కనిపించరు.
ఇక తెలుగు నాట ప్రాంతీయ పార్టీలలో సుప్రసిద్ధమైనది భారత రాష్ట్ర సమితి. రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పార్టీ అధికారాన్ని అనుభవించింది. ఈ పార్టీ వ్యవస్థాపకుడిగా కెసిఆర్ కొనసాగుతున్నారు. రాజకీయాలను నడపడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు. అందువల్లే తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ప్రతి సందర్భంలోనూ కొనసాగించారు. రాజకీయ అవసరాల దృష్ట్యా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించారు. మూడో పర్యాయం అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒకసారి బయటికి వచ్చాయి. కెసిఆర్ పుత్రిక కవిత పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె సస్పెండ్ తర్వాత సంచలన విషయాలను వెల్లడించారు.
అయితే జరుగుతున్న పరిణామాలు భారత రాష్ట్ర సమితిని రాజకీయంగా ఇబ్బందికి గురిచేస్తున్నాయి. పైకి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అంతర్గతంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చిత్రంగా ఉన్నాయి. పార్టీ నుంచి కుమార్తెను సస్పెండ్ చేయడం ద్వారా కేసిఆర్ అల్లుడు హరీష్ రావుకు తలవంచారని.. రాజకీయంగా ఎన్నో వ్యూహాలు అమలు చేసిన కేసీఆర్ సొంత కుమార్తె విషయంలో ఇలా పక్కకు తప్పుకోవడం బాగోలేదని విశ్లేషకులు అంటున్నారు. అయితే కవిత మాత్రం హరీష్ రావు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆయన ఒక కట్టప్ప మాదిరిగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కవిత ఎలాంటి మాటలు మాట్లాడినప్పటికీ హరీష్ రావు వైపు కేసీఆర్ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.