Chandrababu: ఇక తెలంగాణపై చంద్రబాబు గురి!

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సర్వేల నివేదికలు తెప్పించుకొని.. ధీమాతో ఉన్నారు. పోలింగ్ అనంతరం చంద్రబాబు విదేశాలకు వెళ్లారు.

Written By: Dharma, Updated On : June 1, 2024 10:32 am

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారా? అక్కడ టిడిపి బలోపేతంపై దృష్టి పెట్టనున్నారా? తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని నియమించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక వెలుగు వెలిగింది. ఆంధ్ర కంటే తెలంగాణలోనే బాగా చొచ్చుకు పోయింది. కానీ అటువంటి పార్టీ తెలంగాణ ఉద్యమం, టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత క్రమేపీ ఉనికి కోల్పోతూ వచ్చింది. ముఖ్యంగా కెసిఆర్ తన టిఆర్ఎస్ విస్తరణకు టిడిపిని పతనం చేశారు. ఉద్యమ తెలంగాణ నుంచి.. బంగారు తెలంగాణను మార్చే క్రమంలో టిడిపి శ్రేణులను ఆకర్షించారు. టిడిపి పునాదులపైనే టిఆర్ఎస్ ను నిర్మించగలిగారు. కానీ నాటి టిఆర్ఎస్.. నేటి బిఆర్ఎస్ తెలంగాణలో దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్, బిజెపి వ్యూహాలకు బిఆర్ఎస్ పునాదులు కదిలాయి. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు పావులు కదపడం ప్రారంభించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నడుము కట్టారు.

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు బలంగా విశ్వసిస్తున్నారు. ఇప్పటికే సర్వేల నివేదికలు తెప్పించుకొని.. ధీమాతో ఉన్నారు. పోలింగ్ అనంతరం చంద్రబాబు విదేశాలకు వెళ్లారు. ఇటీవల తిరిగి వచ్చారు. ఏపీ, తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఏపీలో అధికారంలోకి వస్తున్నామని.. అందుకే తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ముఖ్యంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి నూతన అధ్యక్షుడు నియామకంపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో విభేదించిన కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరారు. అప్పటినుంచి తెలంగాణ టిడిపి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన మరుక్షణం.. టీటీడీపీ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు.ఆయన పూర్వశ్రమంలో టిడిపికి చెందిన వారే.చంద్రబాబుకు అత్యంత విధేయుడు కూడా.ఇప్పటికీ అదే విధేయతను కొనసాగిస్తూ వచ్చారు.అయితే తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ బలపడకుండా ఉండాలంటే టిడిపిని బతికించాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. దీనికి ఎలాగూ కాంగ్రెస్, బిజెపి సహకరించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ టిడిపి అభిమానులు ఉన్నారు. అటు టిడిపి ద్వారా రాజకీయ లబ్ధి పొందిన నాయకులు ఉన్నారు. వారంతా పార్టీలో చేరితే.. కచ్చితంగా టిడిపి బలపడే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు తెలంగాణలో పార్టీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.ఏ చిన్న అవకాశాన్ని విడిచి పెట్టకూడదని బలమైన నిర్ణయానికి వచ్చారు.