Crime News : తెలంగాణలో అదీ రాజధాని నగరంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఇంటికే కన్నం వేసిన దొంగలు రాష్ట్ర పోలీస్ శాఖకు, లా అండ్ ఆర్డర్ కి సవాల్ విసిరారు. కొద్దోగొప్పో సొత్తు చోరీకి లోనైతే పరువుపోతుందనే బిడియంతో ఉప ముఖ్యమంత్రి కుటుంబీకులు గుట్టుచప్పుడు కాకుండా ఉండేవారేమో కానీ పోయిన సొత్తు విలువ భారీగానే ఉండడంతో దొంగతనంపై ఫిర్యాదు చేశారు. సాదా, సీదా వ్యక్తులు ఫిర్యాదు చేస్తే చూసీ చూడనట్లు వదిలేసేవారేమో కానీ ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఇంట్లో దొంగతనం అయ్యేటప్పటికి, ఇప్పటికే సగం పరువుపోయిందనే అవమానంతో ఉన్న పోలీస్ బాసులు దర్యాప్తు వేగవంతం చేసి ఎట్టకేలకు దొంగల్ని పట్టేశారు.
బెంగాల్ లో పట్టుబడ్డ బీహార్ దొంగలు:
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి చెందిన బంజారాహిల్స్ లోని నివాసంలో భారీగా బంగారం, నగదు చోరీ కేసు దర్యాప్తు చేపట్టిన నగర పోలీసులు.. సెల్ ఫోన్ లోకేషన్ల ట్రాకింగ్, ఇతర ఆధునిక పరిశోధన విధానాల ద్వారా దొంగలు బెంగాల్ లో ఉన్నట్లు గుర్తించారు. బెంగాల్ పోలీసుల్ని అలెర్ట్ చేయడంతో శుక్రవారం వాళ్ళు ఖరగ్పూర్ రైల్వె స్టేషన్ వద్ద ఈ దొంగల్ని పట్టుకున్నారు. బీహార్ కి చెందిన రోషన్ కుమార్ మండల్ , ఉదయ్ కుమార్ ఠాకూర్ గా వీరిని ఖరగ్పూర్ పోలీసులు నిర్ధారించారు.
■ బీహార్ దొంగల వద్ద రూ.2.20 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం : ఖరగపూర్ లో పట్టుబడ్డ బీహార్ దొంగల వద్ద విదేశీ కరెన్సీ, 100 గ్రాముల బంగారం, రూ.2.20 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల్ని పూర్తిగా విచారించడానికిగాను హైద్రాబాద్ తీసుకువచేందుకు నగర పోలీసులు ఖరగపూర్ బయలుదేరివెళ్లారు. ఈ దొంగల్ని తీసుకువచ్చి విచారణ చేస్తే తప్ప ఈ ముట్ఠా గుట్టు, వాళ్ళు చేసిన ఇతర దొంగతనాలు బయటపడనున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఇంట్లో దొంగతనం చేసింది ఎవరెవరు? ఏమేం దోచుకెళ్లారు. ? మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారనే విషయాలు విచారణ చేపడితేగానీ బయటకు రానున్నాయి.
■ విమర్శలపాలవుతున్న హైద్రాబాద్ పోలీసింగ్:
రాష్ట్ర రాజధాని నగర నడిబొడ్డున దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతూ, పోలీసులకి సవాల్ విసురుతుండడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా ఉప ముఖ్యమంత్రి ఇంట్లోనే చోరీ జరగడం, ప్రఖ్యాత సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగడం వంటి సంఘటనలు పోలీస్ శాఖ పనితీరుని ప్రశ్నిస్తున్నాయి. హైడ్రా పబ్లిసిటీ మోజులో పడి, నగర శాంతి,భద్రతలు, రక్షణ చర్యలని పోలీస్ బాసులు గాలికి వదిలేయడంవల్లే దొంగతనాలు పెరిగాయని, ఇకనైనా పోలీస్ బాసులు పోలీసింగ్ కఠినంగా అమలు చేయాలని, పోలీస్లని ట్రాఫిక్ చలనాలకి పరిమితం చేయకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ వహించేలా ఆదేశాలివ్వాలని నగర ప్రముఖులు కోరుతున్నారు.