Palvancha KTPS : 4 టవర్లు.. 6 సెకన్లు.. పాల్వంచ కేటీపీఎస్‌ కూలింగ్‌ టవర్స్‌ కూల్చివేత.. వీడియో వైరల్‌!

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పనులు సులభం అవుతున్నాయి. చిన్న బటన్‌తో పెద్ద పెద్ద పనులు అవుతున్నాయి. శ్రమ తగ్గింది. సమయం తగ్గింది. పనుల్లో వేగం పెరిగింది. నష్టం కూడా తగ్గింది. తాజాగా భద్రాద్రి జిల్లాలో భారీ కూలింగ్‌ టవర్లను సాంకేతిక టెక్నాలజీతో కూల్చివేశారు.

Written By: Raj Shekar, Updated On : August 5, 2024 3:28 pm
Follow us on

Palvancha KTPS : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుండడంతో మనకు శ్రమ తగ్గుతోంది. అన్ని పంనులు యంత్రాలే చేస్తున్నాయి. ఒకప్పుడు రోజుల తరబడి చేసే పని ఇప్పుడు గంటలు, నిమిషాల వ్యవధిలోనే అవుతోంది. కొన్ని పనులు సెకన్ల వ్యవధిలో జరుగుతున్నాయి. ఒకప్పుడు గుంటలను పగులగొట్టాలంటే… మనుషులతోనే చేసేవారు. కానీ ఇప్పుడు యంత్రాలు ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు బావులు తవ్వాలంటే మనుషులే. కానీ, నేడు యంత్రాలు తవ్వుతున్నాయి. బోర్లు వచ్చాయి. గతంలో రోజుల తరబడి చేసే పనులు ప్రస్తుతం ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నారు. దీంతో సమయం ఆదా అవుతోంది. ఖర్చు తగ్గుతోంది. దీంతో అన్నింటిలోకి సాంకేతికత దూసుకువస్తోంది. తాజాగా భద్రాద్రి జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో కాలం చెల్లిన 8 కూలింగ్‌ టవర్లను అధికారులు కూల్చివేశారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు. రెండు దశల్లో 4 టవర్లను ఒకసారి, మరో 4 టవర్లను మరోసారి కూల్చివేశారు. 4 టవర్ల కూల్చివేతకు కేవలం 6 సెకన్లే పట్టింది. ఎవరికీ నష్టం కలుగకుండా టవర్లు కూల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

కాలం చెల్లడంతో..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో కూలింగ్‌ టవర్ల కాలం ముగిసింది. దీంతో వీటిని తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో యంత్రాలతో కూలిస్తే సమయం ఎక్కువ పడుతుంది. ఖర్చు ఎక్కువ అవుతోంది. దీంతో వీటిని కూల్చేందుకు ఆధునిక పరిజ్ఞానం వాడారు. 20 కిలోల పేలుడు పదార్థాలు అమర్చి కేవలం ఆరు సెకన్లలో నాలుగు టవర్లను నేలమట్టం చేశారు.

ఆరు దశాబ్దాల క్రితం నిర్మాణం..
1965–67 మధ్య కాలంలో కేటీపీఎస్‌ను నిర్మించారు. ఆరు దశాబ్దాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెలుగులు నింపడంలో కేటీపీఎస్‌ కీలక పాత్ర పోషించింది. విద్యుత్‌ కర్మాగారంలో బొగ్గును మండించినప్పుడు ఉత్పత్తి అయ్యే వేడిని అదుపు చేసేందుకు ఇందులోని కూలింగ్‌ టవర్లు సహకరిస్తాయి. 103 మీటర్ల ఎత్తుతో నిర్మించిన ఈ టవర్లు పాల్వంచ పట్టణానికే తలమానికంగా ఉండేవి. దేశంలోనే ఎత్తయిన టవర్లుగా చరిత్రలో నిలిచిన ఈ టవర్లను నిర్మించడానికి సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని ఆ రోజుల్లో ఎందరో కార్మికులు శ్రమించారు.

నోయిడాలో టవర్లను కూల్చిన సంస్థ..
ఢిల్లీలోని నోయిడా టవర్లను కూల్చి వేసిన సంస్థ కేటీపీఎస్‌లోని 8 కూలింగ్‌ టవర్లను ఒకేసారి కూల్చి వేసింది. దేశ చరిత్రలో ఇది అరుదైన ఘటనగా అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం జరగకుండా కూల్చివేయదలచుకున్న నిర్మాణం వరకే కూల్చివేస్తారు. ఇంప్లోజన్‌ పద్ధతిలో 20 కేజీల ఎక్స్‌ ప్లోజివ్స్‌ను ఉపయోగించి ఈ టవర్లను నేలమట్టం చేశారు. ఆకాశమంత ఎత్తులో పదుల సంవత్సరాలుగా పాల్వంచ పట్టణ ప్రజల కళ్లకు కనిపించిన టవర్లు కూల్చి వేస్తున్న దృశ్యాలను తిలకించేందుకు ప్రజలు తండోపతండాలుగా కదిలి వచ్చారు.

రెండు దశల్లో కూల్చివేత..
మొత్తం 8 టవర్లను రెండు దశల్లో కూల్చివేశారు. ముందు నాలుగు టవర్లు 6 సెకన్లలో కూల్చిన అధికారులు.. తర్వాత మరో నాలుగింటిని కూడా ఒకేసారి 6 సెకన్లలోనే కూల్చేశారు. రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎగ్జిక్యూట్‌ అనే ప్రైవేట్‌ సంస్థ టవర్ల పేల్చివేత ప్రక్రియను నిర్వహించింది. కూల్చి వేసిన కూలింగ్‌ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి నెల రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ స్థలాన్ని కేటీపీఎస్‌ వినియోగించుకోనుంది.