Khammam Congress Meeting : మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ ఖమ్మంలో గర్జింజబోతోంది. జనగర్జన పేరుతో జూలై 2న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. సభకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించే ప్రయత్నం మొదలు పెట్టింది. ఆర్టీసీ బస్సులు ఇవ్వడానికి నిరాకరిచింది. అడ్వాన్స్ కట్టినా ప్రగతి భవన్ ఆదేశాలతో బస్సులు ఇచ్చేందుకు ఆర్టీసి నిరాకరించింది. ఈ నేపథ్యంలో నడకదారిలో అయినా సభకు తరలి రావాలని కాంగ్రెస్ నేతలు పిలుపు నిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి మొత్తం ఖమ్మంపైనే ఉంది. తెలంగాణలో అధికారానికి దగ్గరవుతున్నామనే నమ్మకం కాంగ్రెస్‌లో క్రమంగా పెరుగుతోంది. ఈ విశ్వాసమే ఇప్పుడు ఖమ్మం సభకు ఐక్యంగా నేతలు కదులుతున్నారు. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్‌లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇక తెలంగాణలో తమకు తిరుగులేదనుకున్న బీఆర్‌ఎస్‌లో ఖమ్మం సభ ఏర్పాట్లతోనే ప్రకంపనలు మొదలయ్యాయి.
Khammam Congress Meeting : ఢిల్లీ నజరంతా ఖమ్మంపైనే.. ప్రగతి భవన్‌లో మల్లగుల్లాలు!
పీపుల్స్ మార్చ్‌తో మరింత ఊపు..
ఖమ్మం సభతో ఒకవైపు కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తుంటే.. మరోవైపు సీఎల్పీనేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్‌మార్చ్ క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసింది. ఎన్నికలకు సమాయత్తం చేసింది. అధికారంలోకి వస్తామన్న నమ్మకాన్ని పెంచింది. దీంతో ఖమ్మంలోనే యాత్ర ముగింపు కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. వెయ్యి కిలోమీటర్లకుపైగా పాయాత్ర చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతను కాంగ్రెస్ అగ్రనేతే సత్కరించటం అనేది అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. ఈ అవకాశం భట్టికి దక్కింది.
పాదయాత్ర అంశాలే ఎజెండా..
ఇక ఖమ్మం సభ ద్వారా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ద్వారా కొన్ని హామీలు ఇప్పించాలని తెలంగాణ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం సీఎల్పీ నేత భట్టి పాదయాత్రలో ప్రజలు తల దృష్టికి తెచ్చిన కీలక అంశాలతో ఎజెండా రూపొందిస్తున్నారు. ఇందులో ప్రధానంగా కౌలు రైతుల సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగ ఖాళీల భర్తీ, పంటలకు మద్దతు ధర తదితర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లో సందడి..
ఇక సభకు ఒక రోజు ముందే కాంగ్రెస్ పార్టీలో సందడి కనిపిస్తోంది. ఉత్సాహం తొనికిసలాడుతోంది. నేతలంతా ఐక్యంగా ముందుకు సాగడం క్యాడర్‌లో జోష్ పెంచుతోంది. ఈ సభలో పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరి ఉండడంతో ఆయా నేతల మద్దతుదారులు అనుచరలు భారీగా తరలి వస్తారని తెలుస్తోంది. పొంగులేటి చాలెంజ్ చేసినట్లుగా బీఆర్‌ఎస్ సభను తలదన్నేలా ప్రజా గర్జన సభ జరుగుతుందన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్ గార్డెన్ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేశారు. ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.
ప్రగతి భవన్‌లో తర్జన భర్జన..
ఇటు కాంగ్రెస్‌లో పండుగ వాతావరణం కనిపిస్తుంటే.. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామని చెబుతున్న సీఎం కేసీఆర్‌తోపాటు తెలంగాణ మత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రగతి భవన్‌లో తర్జన భర్జన మొదలైనట్లు కనిపిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు తాము వద్దన్నవాళ్లే వేరే పార్టీకి వెళ్తున్నారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోపల మాత్ర ఆందోళన కనిపిస్తోంది. వద్దన్నవాళ్ల గురించే పదే పదే మాట్లాడడమే ఇందుకు నిదర్శనం. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండడం గులాబీ నేతలకు మింగుడు పడడం లేదు.
బీజేపీలో గందరగోళం..
కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటుంటే.. బీజేపీలో దంగరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పుపై డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఖమ్మం సభలో బీజేపీ నేతలు ఎవరైనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అని ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తోంది. సభ తర్వాత రాజకీయాలన్నీ కాంగ్రెస్‌వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.