HomeతెలంగాణDelhi Liquor Scam: కవితకు బెయిలా.. మళ్లీ జైలా?:

Delhi Liquor Scam: కవితకు బెయిలా.. మళ్లీ జైలా?:

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల చేతిలో అరెస్టయి.. తీహార్ జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సోమవారం న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది..ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గత నెల 15న కవితను హైదరాబాదులో అరెస్టు చేశారు. మరుసటి రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరు పరిచారు. ముందుగా ఏడు రోజులు, తర్వాత మూడు రోజులు.. ఇలా మొత్తం పది రోజులపాటు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆమెను కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకొని విచారించారు. గత నెల 26న ఆమెను తీహార్ జైలుకు తరలించారు.. తన కుమారుడికి పరీక్షలున్న నేపథ్యంలో, తల్లిగా తాను అతడి పక్కన ఉండాలని, అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగున దానిపై విచారణ జరిగింది. కవిత తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్ పై మాత్రమే ఈనెల 20న వాదనలు వింటామని ఆమె స్పష్టం చేశారు. దీంతో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.

జ్యుడీషియల్ కస్టడీ కూడా..

కవిత జ్యుడీషియల్ విచారణ కూడా మంగళవారంతో ముగియనుంది. ఒకవేళ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయకపోతే.. మంగళవారం కవితను మరోసారి ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరు పరుస్తారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే.. సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ ఈ నెల 20 న జరుగుతుంది. అప్పుడు కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగించే అవకాశాలున్నాయని న్యాయకోవిదులు చెబుతున్నారు.

సీబీఐ విచారణ పై..

తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించడానికి సీబీఐ కి ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం జైల్లోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు ఆ రోజే కవిత తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను రీ – కాల్ చేయాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు..”సీబీఐ విచారణకు సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేదు. కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. అందుకే స్టేటస్ – కో ఇవ్వాలని” విజ్ఞప్తి చేశారు. దీనికి కోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. పిటిషన్ పై సీబీఐ తరఫున న్యాయమూర్తి వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఉత్తర్వులైనా జారీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కవితను విచారించేందుకు “ఏ నిబంధనల ప్రకారం పిటిషన్ దాఖలు చేశారో” స్పష్టంగా చెప్పాలని ఆమె తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి సీబీఐ కి ఆదేశాలు జారీ చేశారు. సీబీఐ దీనికోసం మూడు రోజుల గడువు కోరింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను ఈనెల 10న చేపడతామని న్యాయస్థానం తెలిపింది.. ఈ క్రమంలో వరుసగా సోమ, మంగళ, బుధవారాల్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్ట్ కవితకు సంబంధించిన కేసులను విచారించనుంది.. ఇన్ని పరిణామాల నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ లభిస్తుందా? సీబీఐ విచారణ కు అనుమతి దొరుకుతుందా? అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ

కవిత కేసు విచారణ నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్టు సమాచారం.. ఒకవేళ కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. అప్పుడు ఏమైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంటుందా? గతంలో ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా? అప్పట్లో కోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది? అనే కోణాల్లో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular