Delhi Liquor Case: ఈడీ ఎదుటకు అనిల్.. సుప్రీం తలుపు తట్టిన కవిత.. ఢిల్లీలో ఏం జరగనుంది?

మరోవైపు తొలిరోజు కస్టడీలో ఏడు గంటల పాటు కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను ఏడు గంటల పాటు విచారించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 18, 2024 12:27 pm

Delhi Liquor Case

Follow us on

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆమె భర్త అనిల్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట సోమవారం హాజరుకానున్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.. కవిత రిట్ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని.. ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని కవిత రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీ కొనసాగుతుండగానే కవిత తన అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.

ఈ నేపథ్యంలో సోమవారం అత్యున్నత న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ కేసులో తనను అకారణంగా ఇరికించారని పేర్కొన్న కవిత.. ప్రతివాదిగా ఎన్ ఫోర్స్ మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ ను చేర్చారు.. మరోవైపు కవిత భర్త అనిల్ ను విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సిద్ధమయ్యారు.. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ పై కవిత భర్తను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇప్పటివరకు కవిత పేరు మాత్రమే వినిపించగా.. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తొలిసారిగా కవిత భర్తను విచారణకు పిలవడం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు తొలిరోజు కస్టడీలో ఏడు గంటల పాటు కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను ఏడు గంటల పాటు విచారించారు. నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగింది. ఎన్ ఫోర్స్ మెంట్ సంయుక్త సంచాలకులు భానుప్రియ మీనా ఆధ్వర్యంలో రెండు ప్రాంతాలుగా అధికారులు కవితను విచారించారు.. ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ అనంతరం కవితతో భర్త అనీల్, కేటీఆర్, హరీష్ రావు, న్యాయవాది ములాఖత్ అయ్యారు. ఈ క్రమంలో కవిత అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కొన్ని కేసులు పెండింగ్లో ఉండగా.. తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. కవిత పిటిషన్ నేపథ్యంలో సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు..

కవిత అరెస్టుకు ముందు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అనిల్ తో పాటు ఆమె దగ్గర పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిని విచారించేందుకు సిద్ధమయ్యారు.. కవితను అరెస్టు చేసిన సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్న 5 సెల్ ఫోన్లను సోమవారం నాటి విచారణ సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ప్రస్తావించనున్నారు. వారి ముందే ఆ ఫోన్లను అన్ లాక్ చేసి సమాచారాన్ని పరిశీలించనున్నారు.. ఈ కేసు సంబంధించిన సమాచారాన్ని అనిల్ ద్వారా రాబట్టేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. కాగా, తొలిరోజు కవితను రామచంద్ర, బుచ్చిబాబు, అభిషేక్, రాఘవ, బాగుంట శ్రీనివాసులు, శరత్ చంద్ర ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సోమవారం సెల్ ఫోన్ల మార్పు, బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా పలు ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం.