Telanagana Villages : 20114లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. చివరి సారిగా జనాభా గణన 2011లో చేపట్టారు. 2021లో నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జన గణన చేపట్టలేదు. 2031లో తిరిగి జన గణన చేపడతారు. ఇక ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1.2 లక్షల చ.కి.మీలు. జనాభా 3.51 కోట్ల. విస్తీర్ణంలో తెలంగాణ దేశంలో 11వ రాష్ట్రం. జనాభాలో 12వ స్థానంలో ఉంది. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ 3.5 శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 1961 నుంచి 2011 వరకు జనాభా పరిమాణం, జనాభా సంబంధిత లక్షణాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
జనాభా వృద్ధిరేటు
ఒక ప్రదేశంలో రెండు వేర్వేరు సమయాల్లో జనాభాలో సంభవించే మార్పు లేదా పెరుగుదలను జనాభా వృద్ధిరేటు అంటారు. ఈ మార్పును శాతంలో తెలియజేస్తే జనాభా వృద్ధిరేటు అని, ఒక సంవత్సరానికి గణిస్తే దానిని వార్షిక జనాభా వృద్ధి రేటు అంటారు. తెలంగాణ జనాభాలో 1951–61లో వార్షిక వృద్ధిరేటు 1.7 శాతంగా నమోదైంది. ఈ వృద్ధిరేటు 1961–71లో 2.2, 1971–81 మధ్య 2.5, 1981–91 మధ్య 2.6, 1991–2001లో వార్షిక వృద్ధిరేటు 1.7 శాతం నుంచి 2001–11 నాటికి 1.4శాతం మేరకు పెరిగింది. గత 60 సంవత్సరాల్లో అత్యధిక వార్షిక వృద్ధిరేటు (2.6శాతం) 1981–91 మధ్య నమోదు కాగా, అతి తక్కువ వద్ధిరేటు 1.4 శాతం 2001–11లో నమోదైంది.
గ్రామీణ, పట్టణ జనాభా
– 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3.50 కోట్లు. జిల్లాల వారీగా గమనిస్తే అత్యధికంగా 39,43,323 జనాభాతో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత మేడ్చల్–మల్కాజిగిరి 24,60,095, రంగారెడ్డి 24,26243 వరుసగా రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ములుగు జిల్లా 2,94,671 జనాభాతో అతి తక్కువ జనాభా గల జిల్లాగా చివరి స్థానంలో ఉంది.
– తెలంగాణలో గ్రామీణ జనాభా 2.15 కోట్ల (61.3శాతం) ఉంది. గ్రామీణ జనాభా అత్యధికంగా గల జిల్లా ములుగు (96.1శాతం). రెండో స్థానంలో నారాయణపేట(92.6శాతం), మూడో స్థానంలో మెదక్ (92.3శాతం) జిల్లాలు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా మహానగరం కావడంతో గ్రామీణ జనాభా లేదు. ఆ తర్వాత తక్కువ గ్రామీణ జనాభా మేడ్చల్ మల్కాజిగిరి (8.5శాతం) జిల్లాలో ఉంది.
– తెలంగాణలో పట్టణ జనాభా 1.36 కోట్లు (38.7శాతం) ఉంది. హైదరాబాద్ జిల్లా 39.43 లక్షల జనాభాతో 100 శాతం మేరకు పట్టణ జనాభాను కలిగి ఉంది. మేడ్చల్– మల్కాజిగిరి 22.50 లక్షల జనాభా (91.5శాతం)తో రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ పట్టణ జనాభాను ములుగు 11,493 (3.9 శాతం) ఉంది.
తగ్గిన గ్రామీణ జనాభా..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 2011–23 మధ్య గ్రామీణ జనాభా (–7.84%) తగ్గగా పట్టణ జనాభా (34.05%) పెరిగిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెలువరించిన ’హెల్త్ డైనమిక్స్ ఆఫ్ ఇండియా 2022–23’ వెల్లడించింది. 2023 జులై 1 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జనసాంద్రత విషయంలో దేశంలో ఢిల్లీ(14,491) టాప్‌లో ఉండగా తెలంగాణ(386) 18వ స్థానంలో ఉందని వివరించింది. పట్టణాల్లో 4,885, గ్రామాల్లో 210 ఉందని వివరించింది.