Telangana : బీసీ కులగణన పై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం.. ఏం చేయనుంది?

కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు సవరించాలన్న డిమాండ్‌ దేశంలో చాలాకాలంగా ఉంది. దేశ జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. రిజర్వేషన్ల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందని పోరాడుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : September 10, 2024 7:58 pm

BC Caste Census

Follow us on

Telangana :  దేశంలో బీసీ జనాభా ఎక్కువ. కేంద్రంలో అయినా, రాష్ట్రాల్లో అయినా పార్టీల గెలుపు ఓటముల్లో బీసీలే కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రిజర్వేషన్ల విషయంలో మాత్రం వెనుకబడుతున్నారు. దీంతో ఇది రాజకీయ అంశంగా మారింది. ఈ క్రమంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బీసీ జనగణన చేపట్టారు. ఇక లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా బీసీ గణన చేపడతామని హామీ ఇచ్చింది. అయితే బీసీ కుల గణనపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రం మౌనం వహిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా బీసీ కుల గణన చేపట్టడం లేదు. బిహార్, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌లో బీసీ గణన చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే 2019లోనే బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీసీ గణనకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది, అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. దీంతో తాజా ఉత్తర్వులు ఇచ్చి.. పిటిషన్‌పై కోర్టు విచారణను ముగించింది.

బీసీ కుల గణన ఎందుకు చేయాలి..
భారతదేశంలో కులాల ప్రస్తావన నేటిది కాదు.. చాలా ఏళ్లుగా భారత దేశంలో బలంగా నాటుకుపోయాయి. దేశంలో ఉన్న జనాభాలో సగానికిపైగా కులం ఆధారంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. బాధితులకు ఉపశమనం కలిగించేలా రాజ్యాంగ నిర్మాత బీఆర్‌.అంబేద్కర్‌ రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారు. అందులో భాగంగానే మొదటగా షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించారు. అనంతరం వెనుకబడిన తరగతులకు, ఈ మధ్యకాలంలో అగ్రకుల పేదలకు సైతం రిజర్వేషన్లు అందుతున్నాయి. ఎవరి కుల దామాస ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయమని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచన.

70 కోట్లకుపైగా బీసీలు..
దేశవ్యాప్తంగా బీసీల జనాభా 70 కోట్లకు పైమాటే ఉండగా మొత్తం జనాభాలో ఇది 56% పైగానే ఉంటుందని అంచనా. అయితే ఇప్పటికీ మన దేశం 90 సంవత్సరాల నాటి లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి. కులాల లెక్కలతోనే బీసీల అసలు జనాభా తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్‌ వస్తుంది. పదేళ్లకోసారి జనాభాను లెక్కిస్తున్నా అందులో స్పష్టమైన సమాచారాన్ని సేకరించడం లేదు. అందుకే ఇప్పటికైనా కులగణన చేపట్టి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డ బీసీ కులాల ప్రజలకు న్యాయం చేయాలని బీసీలు కోరుతున్నారు.