David Sawang: అమ్మాయి కోసం.. మాజీ డిజిపి కొడుకు గ్యాంగ్ వార్

ఈ రెండు వర్గాలలో.. ఒక వర్గానికి ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ నాయకత్వం వహిస్తున్నాడు.. ఇంకో గ్యాంగ్ కు సిద్ధార్థ అనే యువకుడు నేతృత్వం వహిస్తున్నాడు.

Written By: Rocky, Updated On : September 14, 2023 1:59 pm

David Sawang

Follow us on

David Sawang: మందు, మగువ.. ఇవి రెండూ డేంజర్. మగవాడిని ఎంత దూరమైనా ఇవి తీసుకెళ్తాయి. ఓ సినిమాలో డైలాగ్ ఇది. అచ్చం ఆ డైలాగ్ లాగానే ఓ మాజీ డిజిపి కొడుకు ఓ అమ్మాయి కోసం రచ్చ రచ్చ చేశాడు. పబ్ లో ఏకంగా గ్యాంగ్ వార్ కు దిగాడు. అర్ధరాత్రి పూట అతడు తన గ్యాంగ్ కు చెందిన వ్యక్తులతో భీతావహం సృష్టించాడు. మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలోని 040 పబ్బులో రాత్రి రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. మొదట ఇది చినికి చినికి గాలి వాన లాగా ప్రారంభమై.. తర్వాత పెద్ద గొడవకు దారి తీసింది. రెండు వర్గాలకు చెందిన వారు మద్యం మత్తులో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇందులో అందరూ కూడా సంపన్న కుటుంబాలకు చెందిన వారే. బాగా తాగిన మైకంలో ఉండటంవల్ల వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని స్థితిలో ఉన్నారు. పరుష పదజాలం వాడుకుంటూ కొట్టుకున్నారని పబ్బు వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ గొడవకి కారణం ఏమిటో అని ఆరా తీస్తే.. ఒక అమ్మాయి వ్యవహారం ఇంతటి వివాదానికి దారి తీసింది అని తెలుస్తోంది.

ఈ రెండు వర్గాలలో.. ఒక వర్గానికి ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ నాయకత్వం వహిస్తున్నాడు.. ఇంకో గ్యాంగ్ కు సిద్ధార్థ అనే యువకుడు నేతృత్వం వహిస్తున్నాడు. వీరి మధ్య ఒక అమ్మాయి విషయంలో కొంతకాలంగా గొడవ జరుగుతున్నది. అయితే ఈ రెండు వర్గాలు పబ్బులో పరస్పరం ఎదురుపడ్డాయి. అందుకే గ్యాంగ్ వార్ కు దిగారు. చివరికి డేవిడ్ వర్గానిదే పై చేయి అయింది. సిద్ధార్థ వర్గానికి చెందిన వారిపై డేవిడ్ వర్గం వారు తీవ్రంగా కొట్టారు. ఒక యువకుడి కన్నుపోయే పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

దెబ్బలు తిన్నవారు గౌతమ్ సవాంగ్ ను కలిశారు. అయితే వారిపట్ల గౌతమ్ సవాంగ్ దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కొన్ని వాట్సప్ చాట్ కూడా రిలీజ్ చేశారు. కాకపోతే ఈ వ్యవహారం పోలీస్, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నది. కాగా గౌతమ్ సవాంగ్ డిజిపి గా ఉన్నప్పుడు ఏపీలో చాలా పవర్ ఫుల్ గా వ్యవహరించారు. ఎవరిపైనయినా కూడా చల్లడం ప్రజాస్వామ్య హక్కు అనే తరహా పోలీస్ అధికారిగా ఆయన పని చేశారని అప్పట్లో విమర్శలు వినిపించాయి. గౌతమ్ సవాంగ్ కొడుకు డేవిడ్ సవాంగ్ కూడా అలానే వ్యవహరించడాన్ని చూసి జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అధికారాన్ని ఇలా వాడుకోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. సిద్ధార్థ వర్గంలో గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, వీరి మధ్య గొడవకు కారణమైన ఆ అమ్మాయి ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సంపన్నుల కేసు కావడంతో పోలీసులు పలు వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.