https://oktelugu.com/

TSRTC Bill: నెలరోజుల్లో ఏం జరిగింది? కేసీఆర్ బిల్లుకు గవర్నర్ ఎందుకు ఆమోదం తెలిపింది?

ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్తామరెడ్డి, కన్వీనర్‌ హనుమంతు, ముదిరాజ్, నరేందర్, ఇతర నేతలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని మంగళవారం కలిశారు.

Written By: , Updated On : September 14, 2023 / 02:03 PM IST
TSRTC Bill

TSRTC Bill

Follow us on

TSRTC Bill: ఆర్టీసీ ఉద్యోగుల నెల రోజుల ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన ఆర్టీసీ విలీనం బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్‌ తమిళిసై గురువారం ఆమోద ముద్ర వేసింది. న్యాయశాఖ పరిశీలన తర్వాత బిల్లులోని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అనంతరం బిల్లును ఆమోదిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

నెల రోజులు పెండింగ్‌..
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఇటీవల గవర్నర్‌ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. కార్మికుల సమస్యలు, విలీన ప్రక్రియకు సంబంధించి పలు సూచనలను గవర్నర్‌కు చేసినట్లు వారు తెలిపారు. బిల్లుపై తగిన సూచనలు తీసుకుని రెండ్రోజుల్లో ఆమోదం తెలుపనున్నట్లు గవర్నర్‌ చెప్పారని ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం అనంతరం వెల్లడించారు. సరిగ్గా వారికి హామీ ఇచ్చిన విధంగానే రెండ్రోజులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేశారు.

గవర్నర్‌తో నేతల సమావేశం..
ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్తామరెడ్డి, కన్వీనర్‌ హనుమంతు, ముదిరాజ్, నరేందర్, ఇతర నేతలు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని మంగళవారం కలిశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 33 సమస్యలతో గవర్నర్‌ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశ్వత్తామరెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్మికులకు 2 పీఆర్సీలు, 2012 పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు రూ.750 కోట్లు, సీసీఎస్‌ కు రూ.1,050 కోట్లు, పీఎఫ్‌ ట్రస్ట్‌ కు రూ. 1,235 కోట్లు, ఎస్బీటీ రూ.140 కోట్లు, ఎస్‌ఆర్బీఎస్‌ రూ.500 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిపై విలీనానికి ముందే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రిటైర్‌ అయిన, వీఆర్‌ఎస్‌ తీసుకున్న ఉద్యోగులకూ పీఆర్సీలు వర్తింప చేయాలన్నారు. కారుణ్య నియామకాల కోసం వెయిట్‌ చేస్తున్న 970 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. ఇంతకుముందు కారుణ్య నియామకాల కింద 160 మందిని తీసుకుని కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారని, వారిని వెంటనే రెగ్యులర్‌ చేయాలన్నారు. ఈ సమస్యలన్నింటిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఇంతలోనే ఎంత మార్పు..
దాదాపు రెండేళ్లుగా ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య దూరం పెరిగింది. ప్రొటోకాల్‌ విషయంతోపాటు అనేక అంశాల్లో కేసీఆర్‌ సర్కార్‌ గవర్నర్‌తో విభేదించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌పై ఆరోపణలు కూడా చేశారు. గవర్నర్‌ కూడా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను తప్పు పట్టారు. లోపాలను ఎత్తి చూపారు. ఇదిలా ఉండగా ఒక్కసారిగా అటు సీఎం కేసీఆర్, ఇటు గవర్నర్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రిపదవి ఇవ్వడంతో ఆయన ప్రమాణ స్వీకారం కోసం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో అరగంటపాటు చర్చలు జరిపారు. ఈ చర్చలతో ప్రగతిభవన్‌ రాజ్‌భవన్‌ మధ్య గ్యాప్‌ తగ్గిపోయింది.

కొత్త సెక్రెటరీకి…
సమావేశం జరిగిన రెండు రోజులకే కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసైని కొత్త సెక్రటేరియేట్‌ ఆవరణలో నిర్మించిన ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గవర్నర్‌ వేడుకలకు హాజరయ్యారు. ప్రారంభోత్సవాల అనంతరం కేసీఆర్‌ దగ్గరుండి గవర్నర్‌కు కొత్త సెక్రటేరియేట్‌ను చూపించారు. నూతన భవనంలోని ప్రత్యేకతలను వివరించారు.

పెండిగ్‌ బిల్లులు క్లియర్‌..
ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లుల ఆమోదంలో బెట్టు చేసిన గవర్నర్‌.. కేసీఆర్‌తో సమావేశం.. సెక్రెటేరియేట్‌కు వెళ్లిన తర్వాత పెండింగ్‌ బిల్లుల క్లియరెన్స్‌పై దృష్టిపెట్టారు. దీంతో గవర్నర్‌ కేసీఆర్‌ మధ్య సయోధ్య కుదిరిందా.. ఎన్నికల వేళ గవర్నర్‌తో విభేదాలు మంచిది కాదన్న అభిప్రాయానికి కేసీఆర్‌ వచ్చారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో గవర్నర్‌ కేసీఆర్‌ ఒత్తిడికి తలొగ్గారా.. అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.