Homeక్రైమ్‌Ranga Reddy Crime : దైవాలగూడలో రాజ్ కుమార్ నెత్తుటి చరిత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది

Ranga Reddy Crime : దైవాలగూడలో రాజ్ కుమార్ నెత్తుటి చరిత్ర.. ఈ ప్రశ్నలకు బదులేది

Ranga Reddy Crime : ఒక్క రాత్రి.. ఒకే ఒక్క రాత్రి.. రెండు గంటలు.. అత్యంత కిరాతకంగా.. మహా క్రూరంగా.. ఆరు ప్రాణాలు పోయాయి. షాబాద్ మండలం దైవాలగూడలో రక్తం ఏరులై ప్రవహించింది. మూడు సంవత్సరాల పరీక్షిత్.. రెండు సంవత్సరాల దైవిక్షిత్.. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళ తల్లి పార్వతి సరిత ప్రేమించి పెళ్లాడిన భర్త చేతిలో హత్యకు గురైంది. ఇంకొక కుటుంబంలో 17 సంవత్సరాల బాలిక.. ఆమె తల్లి.. అమ్మమ్మ ఒకే రాత్రి హత్యకు గురయ్యారు. ఇదంతా చేసింది ఒకే ఒక్కడు. ఆ కౌమర బాలికపై వేధింపులకు పాల్పడి.. కేసు నమోదయి.. పరారీలో ఉన్న రాజ్ కుమార్
.

వాస్తవానికి ఇది ఒక క్రైమ్ కథ కాదు. మన వ్యవస్థ.. అందులో ఉన్న లోపం.. ఆలోపం వల్ల జరిగిన నష్టం.. పోయిన ప్రాణాలు.. ఈ ఏడాది మే 16న ఆ బాలిక తనను వేధిస్తున్న వ్యక్తి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. వాస్తవానికి ఆ వయసులో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడ ఉంటాయి. మామూలు విషయం కాదు. తన కూతురి కోసం ఆ అమ్మాయి తల్లి కూడా గట్టిగా నిలబడింది. కానీ ఇంత చేసినప్పటికీ మన వ్యవస్థ వారికి అండగా నిలబడలేకపోయింది. పైగా మన పోలీసు వ్యవస్థ ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి.. కొద్దిరోజుల్లోనే వ్యక్తిగత పూచికత్తు మీద విడుదల చేసింది. బెయిల్ రావడం ఒక రకంగా చట్టపరమైన హక్కు. కానీ ఆ దుర్మార్గుడి నుంచి ఆ కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి.. ఆ దుర్మార్గుడు అత్యంత స్వేచ్ఛగా.. కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే తిరుగుతున్నప్పుడు.. ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు చేసిన ఆ బాలిక మళ్లీ మళ్లీ వేధింపులకు గురి కావడం మన సమాజంలో ఇదే తొలిసారి కాదు. అన్యాయం జరిగినప్పుడు.. ఇబ్బందులు ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రతి అమ్మాయికి.. ప్రతి మాతృమూర్తికి ఇటువంటి ఘటన ఒక భయానకమైన అనుభవాన్ని కళ్ళ ముందు ఉంచుతుంది..

రాజ్ కుమార్ స్వల్పకాలంలో రెండిళ్లలో తీరని శోకాన్ని నింపాడు. ఆ బాలికను ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె మీద అత్యాచారం చేశాడు. అప్పటికి అతడి కసి తీరలేదు. వెంటాడి వేటాడి చంపేశాడు. అనంతరం నేరుగా తన ఇంటికి వెళ్ళాడు. ప్రేమించి పెళ్లాడిన భార్యను చంపేశాడు. పిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. చివరికి తాను చేసిన ఘనకార్యాన్ని ఫోన్లో ఒక వ్యక్తికి ఫోన్ చేసి చెప్పుకున్నాడు.

ఈ సంఘటన కేవలం పగను మాత్రమే సూచించడం లేదు. కోపాన్ని మాత్రమే ప్రదర్శించడం లేదు.. ఒక వ్యక్తి ఒక ఆడదాన్ని తన ఆస్తిగా భావించినప్పుడు.. అతడి ఉన్మాదం పరాకాష్టకు చేరుతుంది..”నా మాట నువ్వు వినాల్సిందే. నాకు నువ్వు అడ్డువస్తే.. నువ్వు ఉండవు. మీ కుటుంబం జీవించి ఉండకూడదు” అనే వికృత మనస్తత్వం వల్లే రాజ్ కుమార్ ఇటువంటి దారుణానికి పాల్పడ్డాడని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.. ఆడవాళ్లను.. తన ఆస్తిగా చూసే మగవాళ్ళ మనస్తత్వం మారానంతవరకు సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అటువంటి ఆలోచనను మగవాళ్ళు కూకటి వేళ్లతో సహా పెకిలించగలగాలి. అప్పుడే దైవాల గూడ ప్రాంతంలో జరిగిన దారుణాలు మరోప్రాంతంలో చోటు చేసుకోవు.

ఫోక్సో వంటి తీవ్రమైన కేసుల్లో బెయిల్ ఇస్తున్నప్పుడు.. బాధితురాలి సెక్యూరిటీని ఎందుకు లెక్కలోకి తీసుకోరు..

ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి.. ఇబ్బందులకు గురైన వ్యక్తులు ఒకే గ్రామాల్లో ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు నిఘా ఏర్పాటు చేయలేదు..

ఆ అమ్మాయి కుటుంబం రక్షణ కోరినప్పటికీ పోలీసులు స్పందించలేదు.. ఒకవేళ ఇదే గనుక నిజమైతే అప్పుడు దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి..

చివరగా పరీక్షిత్.. దైవిక్షిత్ అనే ఇద్దరు చిన్నారులు రక్తపు మడుగులో కనిపిస్తున్న దృశ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. న్యాయం కోసం ఆ బాలిక ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.. ఇకపై ఆమె పేరు మన వ్యవస్థ వైఫల్యానికి బలమైన సాక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఘోరం.. ఈ రక్త కన్నీరు.. కొద్దిరోజుల వరకు మీడియాలో కనిపిస్తుంది. కానీ ఈ ఘటన ఒక నిజమైన మార్పుకు కారణం కావాలి.. లేదంటే మరో దైవాల గూడ.. ఇంకొక రాజ్ కుమార్.. కచ్చితంగా పుడతారు.. వారిని ఎవరూ ఆపలేరు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular