Cyclone montha effect: మొదట్లో వర్షాలు లేవు. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ పంటలు సాగు చేశారు. యూరియా అందుబాటులో లేకపోతే నానా కష్టాలు పడి సేకరించారు. పంట ఎదిగే క్రమంలో చీడపీడలు ఆశిస్తే.. పురుగు మందులు పిచికారి చేసి కాపాడుతున్నారు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత పంట ఏపుగా ఎదిగింది. మరి కొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకుంటున్న క్రమంలో మాయదారి వర్షం నిండా ముంచింది. నిన్నటి వరకు మొంథా తుఫాన్ కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమవుతుందని అందరూ అనుకున్నారు. కానీ బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి మెదక్ నుంచి మొదలు పెడితే ఉమ్మడి వరంగల్ వరకు అతి భారీ వర్షపాతం నమోదు కావడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
పలు ప్రాంతాలలో వరి పంటను రైతుల కోశారు. ధాన్యాన్ని నూర్చి మార్కెట్ కేంద్రాలకు తరలించారు. బుధవారం కురిసిన వర్షం వల్ల ధాన్యం మొత్తం తడిసిపోయింది. రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం ఎందుకూ పనికిరాకుండా పోయింది. విస్తారంగా వర్షం కురుస్తుండడంతో.. వరద నీరు ముంచెత్తడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేయరని రైతులు వాపోతున్నారు. వర్షానికి తడవడం వల్ల ధాన్యం రంగు మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా కొంతమంది రైతులు ముందుగా వరి నాట్లు వేయడంతో.. ఆ పంట కోతకు వచ్చింది. గాలుల తీవ్రతకు వరి పంట మొత్తం నేల వాలిపోయింది. పంట నేల వాలిపోవడంతో ధాన్యం గింజలు మొత్తం రాలిపోయాయి. దీంతో తాము నిండా మునిగామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే వర్షాలు కురిస్తే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన ఆకుల వెంకన్న అనే రైతు ఏడెకరాలలో వరి సాగు చేపట్టాడు. ఎకరంన్నర విస్తీర్ణంలో ముందుగా వరి సాగు చేశాడు. ఆ పంట ప్రస్తుతం కోతకు వచ్చింది. మరో ఐదు రోజుల్లో ఆ పంట కోసేందుకు సిద్ధమవుతుండగా.. ఈలోగా వర్షాలు కురిశాయి. దీనికి గాలులు కూడా తోడు కావడంతో పక్వానికి వచ్చిన వరి పంట మొత్తం నేల వాలిపోయింది. కింద పడిన పంటను చూస్తూ రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు.. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
“భీమా పథకాల మీద మాకు అవగాహన లేదు. కనీసం వ్యవసాయ శాఖ అధికారులు కూడా మాకు చెప్పలేదు. పంట చేతికి వచ్చే క్రమంలో ఇలా వర్షాలు కురుస్తున్నాయి. వరి మడులలో నీటి నిల్వ అధికంగా ఉంది. ఇలానే వర్షాలు కురిస్తే పంట చేతికి వచ్చేది చాలా కష్టం. భారీగా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నష్టాన్ని అంచనా వేసి.. పరిహారాన్ని అందించాలని” ఆకుల వెంకన్న కోరుతున్నాడు.