IT Employees: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు.. రెండు మూడేళ్లుగా చలికాలంలో ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ అమలు చేస్తున్నారు. వాహనతో కాలుష్యం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కారణంగా ఆల్టర్నేట్ డేస్ డ్యూటీ అమలు చేస్తుంది ఢిల్లీ సర్కార్.. తాజాగా విశ్వనగరం హైదరాబాద్‌లో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. అయితే అది చలికాలంలో కాలు వర్షాకాలంలో.. అదెలా అంటే విశ్వనగరం చిన్న పాటి వర్షానికే చిగురిటాకులా వణుకుతోంది. ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంగా ఆల్టర్నేట్ డేస్.. లేదా వర్క్ ఫ్రం హోం అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ప్రకటనే నిదర్శనం.
ఐటీ ఉద్యోగులకు సూచన..
నగరంలో వర్షాల కారణంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసులు ఒక కీలక సూచన చేశారు. కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతా జలమయంగా మారింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో వర్షాల కారణంగా ట్రాఫిక్ బీభత్సంగా పెరిగిపోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంపిక చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు ఐటీ ఉద్యోగులకు సూచించారు.
భారీ వర్ష సూచనతో..
నగరంలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అనవసరంగా బయటకు రావొద్దని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం ఎంపిక చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈమేరకు ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ప్రకటన చేశారు.
నగరంలో ప్రయాణం.. నరకం..
విశ్వనగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా.. ట్రాఫిక్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. విశ్వనగరానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగడం లేదు. ఫ్లయ్ ఓవర్ వంతెనలు నిర్మిస్తున్నా చాలడం లేదు. ఇక వర్షం పడితే నగరంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. గంటకు ఒక కిలోమీటర్ కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంటోంది. ఇక వరదలు ముంచెత్తుతున్నాయి. నాలాలు పొంగి ప్రజలను మింగేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలను ఇంటికే పరిమితం చేయడం ఒక్కటే మార్గంగా పోలీసులు భావిస్తున్నారు. అందేకే తాజాగా వర్క్ ఫ్రం హోం ఆప్షన్ బెటర్ అని సూచిస్తున్నారు.