Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కీలక అంకానికి రంగం సిద్ధమైంది. 119 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.. ఇప్పటికే కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు వచ్చాయి.. ఈ ట్రెండు కొనసాగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ ఓట్ల లెక్కింపుకు ముందు తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అయితే ఓటర్ నాడీ ఎటువైపు ఉంది అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ను మేము నమ్మబోమంటూ భారత రాష్ట్ర సమితి ప్రకటించింది.
నిన్నంతా నాటకీయ పరిణామాలు
తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో నిన్నంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేటీఆర్ మూడోసారి గెలుస్తున్నామని, తుపాకీ పట్టుకున్న ఒక ఫోటోను ట్విటర్లో ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇబ్రహీంపట్నంలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్ డబ్బా అక్కడి ఆర్డిఓ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. తాళం కూడా తీసి ఉంది. అటు కేటీఆర్ ట్విట్ చేయడం, ఇటు ఆ పోస్టల్ బాక్స్ డబ్బా తాళం తీసి ఉండడంతో కలకలం నెలకొంది. అయితే ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని రకరకాల రాజకీయ విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. తెర వెనుక ఏదో జరిగిందని అందుకే కేటీఆర్ మూడవసారి విజయం సాధిస్తామని చెప్పారనే విమర్శలు వినిపించాయి.
రంగంలోకి డీకే శివకుమార్
ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలావరకు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పాజిటివ్ గా రిపోర్ట్ ఇచ్చాయి. దీంతో ఆ పార్టీ నాయకులు అంతర్గతంగా సంబరాలు మొదలుపెట్టారు.. అయితే కాంగ్రెస్ పార్టీలోనే 15 మంది కోవర్టులు ఉన్నారని, కెసిఆర్ నామమాత్రంగా సీట్లు గెలుచుకున్నప్పటికీ వారు మద్దతు ఇస్తారని ప్రచారం జరిగింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. రెండవ మాటకు తావు లేకుండా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఆయన వెంటనే హైదరాబాదులో వాలిపోయారు. తమ పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ మాట్లాడారని సంచలన ఆరోపణలు చేశారు. గత పరిణామాలు పునరావృతం కాకుండా ఉండేందుకు వెంటనే ఆయన ఏఐసీసీ పరిశీలకులను రంగంలోకి దింపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వెంట ఉంచారు. గెలిచిన వెంటనే వారిని తాజ్ కృష్ణ హోటల్లోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశారు.. అయితే ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఎటువైపు మొగ్గు
సర్వే సంస్థలు ఎన్ని రకాల ఫలితాలను ప్రకటించినప్పటికీ ఓటర్ నాడీ ఎటువైపు ఉందో అనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. అందువల్లే కేటీఆర్ మేమే గెలుస్తామని ప్రకటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక సర్వే సంస్థలు గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపించిన నేపథ్యంలో.. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఐదు గంటల దాకానే సర్వే సంస్థలు శాంపిల్స్ సేకరించాయని.. కొన్ని చోట్ల సాయంత్రం 8:30 దాకా కూడా పోలింగ్ జరిగిందని.. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎలా చెబుతారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.. ఇక కమలం పార్టీ నాయకులు కూడా తమకు మంచి సీట్లు వస్తాయని, హంగ్ ప్రభుత్వం ఏర్పడితే తాము కీలకం అవుతామని వారు చెప్తున్నారు. గతానికంటే ఎక్కువగా తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని, సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ సంస్థలు తమకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయని.. ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారని భావిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వారు చెబుతున్నారు.
అయితే ఇన్ని విశ్లేషణలు జరుగుతున్నప్పటికీ ఓటర్ మాత్రం ఇప్పటికీ గుంభనాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో తెలంగాణ ఓటర్ తీర్పు ఏ విధంగా ఉందో.. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారో? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వస్తుందో? లేక కమలం పార్టీ గేమ్ చేంజర్ అవుతుందో తేలుతుంది.