Congress vs BRS : కాంగ్రెస్ vs బీఆర్ఎస్.. ఇంతకీ తెలంగాణలో ఎవరి పరిస్థితి ఎలా ఉంది?

బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ ఈ విధంగా బూస్టింగ్ ఇస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో గులాబీ పార్టీపై ఫైర్ అయ్యారు. మూసీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని లెక్కలతో సహా వివరించారు.

Written By: Srinivas, Updated On : October 19, 2024 6:57 pm

Congress vs BRS

Follow us on

Congress vs BRS : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దశాబ్ద కాలం పాటు రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా వెలుగు వెలిగిన పార్టీ.. ఇప్పుడు రోజురోజుకూ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మాట స్వయానా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ఒప్పుకున్నారు కూడా. పార్టీ పెట్టిన తరువాత ఇలాంటి పరిస్థితులు రాలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ పార్టీని కూడా మరింత డీమోరల్ చేసే దిశగానే ముందుకు సాగుతున్నారు.

ఇటీవల బీఆర్ఎస్వీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డి పదవిని కాపాడుకునే పనిలో ఉన్నారని అన్నారు. అన్నివర్గాలను సైతం కాంగ్రెస్ మోసం చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. పోరాటాలు కూడా మనకు కొత్త కాదని హితబోధ చేశారు. అందుకే.. ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పుడు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని తెలిపారు. తమ బాధలను పట్టించుకోని.. తమ తరఫున కొట్లాడాలని కోరుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైడ్రా, మూసీ బాధితులు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారని అన్నారు. వారి తరఫున కొట్లాడేందుకు వెనక్కి పోయేది లేదని స్పష్టం చేశారు.

అందుకే.. పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే 12వేల మంది ఆశా వర్కర్లతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తామన్నారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. దాంతో ఈ జీవో పైనా ఉద్యమిస్తామని వెల్లడించారు. అలాగే.. వచ్చేనెల 5వ తేదీన నిర్వహించే ఆటో డ్రైవర్ల ధర్నాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా కాంగ్రెస్ పాలనలో బాధపడని వారు లేరని వ్యాఖ్యానించారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలక పాత్ర పోషించాలని వారికి సూచించారు. కేసులకూ భయపడొద్దని, లీగల్ సెల్‌ను బలోపేతం చేస్తామన్నారు. విద్యార్థి నాయకులను కంటిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. అవసరమైతే రాష్ట్ర నాయకత్వం దృష్టికి సమస్యను తీసుకురావాలని అన్నారు.

బీఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ ఈ విధంగా బూస్టింగ్ ఇస్తుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో గులాబీ పార్టీపై ఫైర్ అయ్యారు. మూసీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని లెక్కలతో సహా వివరించారు. మూసీకి ఇప్పటివరకు చేసిన ఖర్చును వెల్లడించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టారు. కేటీఆర్, హరీశ్ పై ఓ స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పొలిటికల్ హీట్ నడుస్తూనే ఉంది. దీంతో ప్రజల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఇరు పార్టీలు ప్రజల కోసం ఆలోచిస్తున్నాయా..? లేదంటే వారి స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారా..? అన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.