Congress Cabinet: తెలంగాణ మంత్రులు వీరేనా?

తెలంగాణలో వన్‌మెన్‌ ఆర్మీ షో ఉండదని, టీం వర్క్‌ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది.

Written By: Raj Shekar, Updated On : December 6, 2023 11:28 am

Congress Cabinet

Follow us on

Congress Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్‌ నేత కేసీ.వేణుగోపాల్‌ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేలు ప్రతిపాదించారని తెలిపారు. తెలంగాణలో వన్‌మెన్‌ ఆర్మీ షో ఉండదని, టీం వర్క్‌ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో సీఎం ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది. మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరోవైపు సీనియర్‌ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం తమస్థాయిలో పరవీలు చేస్తున్నారు.

రేసులో వీరు..
మంత్రి పదవి రేసులో సీనియర్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, సీతక్క, మంత్రులుగా శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌/ వివేక్, రాజనర్సింహ, రామ్మోహన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్‌ పద్మావతికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది.

సోనియతో వినోద్‌ భేటీ..
ఒకవైపు సీఎం ఎవర్న విషయంలో సందిగ్ధం కొనసాగుతుండగానే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిశారు. మంత్రి పదవిలో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లుల తెలిసింది. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి హామీ మేరకే తాము పార్టీలోకి వచ్చామని తెలిపారు. దీంతో మంత్రి పదవి కోసమే వినోద్‌ సోనియాగాంధీని కలిసినట్లు స్పష్టమైంది.

ఉత్తమ్‌కు టీపీసీసీ పగ్గాలు..
ఇక సీనియర్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగిస్తారని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రి కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ రేవంత్‌వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌ అయితేనే బాగుంటుందని ప్రతిపాదించడంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాస్త నొచ్చుకున్నారు. దీంతో ఆయనకు టీపీసీసీ పదవి ఇవ్వనున్నట్లు అధిష్టానం హామీ ఇచ్చిందని సమాచారం.