HomeతెలంగాణCongress: కారును కట్టడి చేసేందుకు కాంగ్రెస్ బంపర్ ప్లాన్.. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల అరెస్టులు...

Congress: కారును కట్టడి చేసేందుకు కాంగ్రెస్ బంపర్ ప్లాన్.. కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవా?

Congress: వీటికంటే ముందే ఇటీవల సీయోల్ పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలుతాయని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇక మరోవైపు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వాడపల్లి నుంచి సెక్యూరిటీ లేకుండానే పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి.. ఎగ్గొట్టిన 6 గ్యారంటీల పై నిలదీస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ అవకతవకలపై సమగ్రంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యల దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రభుత్వం నియమించిన కమీషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసింది. జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ కూడా మరో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.

నోటీసులు జారీ చేసే అవకాశం

కాలేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దాని నిర్మాణం వెనుక భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇన్ని రోజులుగా సమగ్రంగా దర్యాప్తు జరిపింది. వేగంగా ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ – రేస్ నిర్వహణలో నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త సంచాలకుడి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఫార్ములా ఈ – రేస్ నిర్వహణలో కేటీఆర్, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఊహించని షాక్ ఇస్తుందా?

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన పాదయాత్ర మొదలుపెట్టక ముందే కోలుకోలేని షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కూడా అంతర్గత సంభాషణలో ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే ప్రజలలో విపరీతమైన సానుభూతి పెరిగే అవకాశం ఉందని.. అందువల్లే అటువంటి కార్యక్రమాన్ని ముందే చేపట్టకూడదని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదే నెలలో ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తుంది. శాసనసభ వేదికగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలను, అవకతవకలను మంత్రివర్గంలో.. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. అందులో కేసీఆర్, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగానే పొలిటికల్ బాంబులు పేల్చడానికి సిద్ధమైనట్టు రేవంత్ రెడ్డి సర్కార్ సంకేతాలు ఇస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular