IAS officers: ఆ ఐఏఎస్ ల పై ఈసీ కొరడా.. ఎన్నికల విధులకు దూరం

ప్రతి ఎన్నిక సందర్భంలో అధికారులపై ఆరోపణలు రావడం సహజమే. కానీ.. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారుల పేర్లు, వారి అవినీతి, పక్షపాతం తదితరాలపై చాలా గట్టిగానే ఫిర్యాదు చేసింది.

Written By: Bhaskar, Updated On : October 9, 2023 12:30 pm
Follow us on

IAS officers: రాష్ట్రంలోని కొంతమంది ఐఏఎస్‌ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొరడా ఝళిపించనుందా? రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వారిని దూరం పెట్టనుందా? ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు ఈ షాక్‌ తప్పదా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే అంటున్నాయి అధికార వర్గాలు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసిన అధికారుల్లో కొంతమందిపై ఈసీ చర్యలు తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ఈసీ కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ ఈ అధికారులు ఏవైనా తప్పులు చేశారా? పార్టీలు చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత వరకూ ఉంది? వీరి వల్ల ప్రతిపక్షాలకు నష్టం జరుగుతుందా? వీరు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారా? ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌)ని ఉల్లంఘిస్తున్నారా? ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఓట్లను తొలగించడంలో ఏవైనా గిమ్మిక్కులు ప్రదర్శించారా!? తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే.. సంబంధిత అధికారులను ఈసీ పక్కన పెట్టే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రతి ఎన్నిక సందర్భంలో అధికారులపై ఆరోపణలు రావడం సహజమే. కానీ.. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారుల పేర్లు, వారి అవినీతి, పక్షపాతం తదితరాలపై చాలా గట్టిగానే ఫిర్యాదు చేసింది. రాష్ట్రానికి మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషన్‌ అధికారులకు లిఖితపూర్వకంగా వివరాలు వెల్లడించింది. ఆరుగురు ఐఏఎస్‌లు, మరో ముగ్గురు నాన్‌-ఐఏఎస్ లు, సీఎస్‌, డీజీపీ, ఇతర పోలీసు అధికారులపై ఫిర్యాదు చేసింది. బీజేపీ కూడా ఇదే తీరులో ఫిర్యాదు చేసింది. ఇలా రెండు జాతీయ పార్టీలూ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు సీఈవో కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. షెడ్యూలు వెలువడకముందే ఒకరిద్దరు అధికారులపై వేటు వేయవచ్చని తెలుస్తోంది.

ఫలానా అధికారిని బదిలీ చేయాలనో లేక ఆ అధికారి ఎన్నికల విధుల్లో భాగస్వామి కాకుండా చూడాలనో ఆదేశించవచ్చని తెలుస్తోంది. అయితే.. ఎంతమంది అధికారులకు షాక్‌ తగులుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని ఆ వర్గాలు తెలిపాయి. మొత్తానికి రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం కన్నేసి ఉంచిందన్న విషయం వాస్తవమని, కనీసం తీరు మార్చుకోవాలంటూ వారిని అంతర్గత ఉత్తర్వుల ద్వారా హెచ్చరించే అవకాశాలు ఉండొచ్చని అంటున్నాయి.