Assembly Election Results 2024: సేమ్ అవే ఫలితాలు. ఏదీ మారలేదు. ప్రజలు మార్పు కోరుకోలేదు. అభివృద్ధి మంత్రానికి మరోసారి జై కొట్టారు.. ప్రతిపక్షాలకు మరోసారి మొండి చేయి చూపించారు. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. అరుణాచల్ ప్రదేశ్ మరోసారి బిజెపి ఖాతాలోకి వెళ్లిపోయింది.. సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఈశాన్య రాష్ట్రాలుగా పేరుపొందిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్నికలకు ముందు పది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 50 స్థానాలకు పోటీ జరిగింది. ఇందులో 46 స్థానాలలో బిజెపి అభ్యర్థులు సునాయసంగా విజయం సాధించారు. మిగతా స్థానాలలో బిజెపికి మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సిపి, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఈ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ ఏడు సీట్లు, నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు, కాంగ్రెస్ పార్టీ 4, పీపుల్స్ పార్టీ అరుణాచల్ ఒక సీటు గెలుచుకున్నాయి. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. “అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు అభివృద్ధికి మరోసారి పట్టం కట్టారు. నిస్సందేహంగా వారు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీపై తమ విశ్వాసాన్ని మరలా ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు. అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధికి మరింత శక్తివంతంగా పనిచేస్తామని” ప్రధాని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ లో మూడోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండు స్పందించారు. ” కేంద్రం నుంచి భారీ మద్దతు వల్ల గత పది సంవత్సరాల లో అరుణాచల్ ప్రదేశ్ సమూలంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు ఉదయించే భూమి అని మీ అందరికీ తెలుసు. ఇక్కడ బిజెపి విజయం దానిని మరోసారి ప్రతిబింబించింది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని” ఆయన ట్విట్టర్ ఎక్స్ లో ప్రకటించారు.
ఇక సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా మరోసారి అధికారంలోకి వచ్చింది. 32 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో 31 స్థానాలలో ఎస్కేఎం విజయం సాధించింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కేవలం ఒకే ఒక్క
స్థానంలో విజయాన్ని అందుకుంది. ఈ విజయం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మీడియాతో మాట్లాడారు..” సిక్కిం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మా నిండు మనసుతో ప్రజల కోసం పనిచేశాం. అందుకే మళ్ళీ గెలిచామని” పేర్కొన్నారు.. మరోవైపు దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్డీఎఫ్ అధినేత పవన్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాలలో ఓడిపోయారు. ఇక సిక్కిం లోని ఏకైక పార్లమెంటు స్థానానికి, అరుణాచల్ ప్రదేశ్ లోని రెండు ఎంపీ స్థానాలకు జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More