https://oktelugu.com/

T20 World Cup 2024: ఇవి అమెరికా క్రాస్ బ్రీడ్ పిచ్ లు.. ఎంతకీ అర్థం కావు.. కొరుకుడు పడవు..

వెస్టిండీస్ దేశంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో బ్యాటర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నమోదైన స్కోర్లే ఇందుకు ఉదాహరణ. ఇక అమెరికా కేంద్రంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో స్పిన్ బౌలింగ్ కీలకపాత్ర పోషించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 2, 2024 6:31 pm
    T20 World Cup 2024

    T20 World Cup 2024

    Follow us on

    T20 World Cup 2024: పొట్టి ప్రపంచ కప్ మొదలైంది. తొలి మ్యాచ్లో కెనడాపై అమెరికా ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్, అమెరికా దేశాలు ఈసారి టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నాయి. సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల హవా కొనసాగుతుంది. అలాంటప్పుడు వారికి చెక్ పెట్టేందుకు బౌలర్లు రకరకాల ప్రణాళికలతో రంగంలోకి దిగాల్సి ఉంటుంది. పిచ్ నుంచి సహకారం లభించేందుకు తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుంది. వెస్టిండీస్ ను మినహాయిస్తే అమెరికా లో ఏర్పాటు చేసిన క్రికెట్ క్రీడా మైదానాలలో ఏ బౌలర్లకు సహకారం లభిస్తుందనే ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. ఇటీవల జరిగిన ప్రాక్టీస్ మ్యాచులు, అమెరికా, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ లోనూ సరైన జవాబు దొరకలేదు.

    వెస్టిండీస్ దేశంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో బ్యాటర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నమోదైన స్కోర్లే ఇందుకు ఉదాహరణ. ఇక అమెరికా కేంద్రంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లలో స్పిన్ బౌలింగ్ కీలకపాత్ర పోషించింది. క్రీజ్ లో కుదురుకోవడమే కష్టం, ఒక్కసారి కుదురుకుంటే ఇక తిరుగులేదు అనే తీరుగా బ్యాటర్లు నిరూపించారు. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత స్పిన్నర్లు బౌలింగ్ వేసిన తీరే ఇందుకు ఉదాహరణ. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో భారత ఆటగాడు శివం దుబే ఐపీఎల్ తరహాలో స్పిన్ బౌలింగ్లో ఒక రేంజ్ లో బాద లేకపోయాడు. కొన్ని బంతులను బయటికి పంపించేందుకు అతడు ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. శివం దుబే 16 బంతులు ఎదుర్కొనగా.. కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సిక్సర్ ఉంది. బంగ్లా ఫీల్డర్లు రెండుసార్లు క్యాచులు మిస్ చేయడంతో శివం దూబే బతికిపోయాడు. చివరికి స్పిన్ బౌలర్ బౌలింగ్ లోనే భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు.. అమెరికా మైదానాలలో స్పిన్ బౌలర్ల బౌలింగ్ లో దూకుడుగా ఆడదామని అనుకునే క్రీడాకారులకు శివం దూబే ఔట్ అయిన విధానం ఒక పాఠం.

    పొట్టి ఫార్మాట్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ లను ఎదుర్కోవడం బ్యాటర్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే టీమిండియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో బంగ్లా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లు షకీబ్ అల్ హాసన్ (0/47), తన్వీర్ ఇస్లాం (1/29) పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. వీరి బౌలింగ్లో హార్దిక్ పాండ్యా (40), రిషబ్ పంత్ (53) దుమ్ము రేపే రేంజ్ లో సిక్స్ లు, ఫోర్లు కొట్టారు. ముఖ్యంగా తన్వీర్ ఇస్లాం బౌలింగ్లో హార్దిక్ పాండ్యా హ్యాట్రిక్ సిక్స్ లు బాదాడు. ఇక టీమిండియాలోని ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ అత్యంత పదునైన బంతులు వేయడం విశేషం. బంగ్లాదేశ్, భారత్ జట్లు కలిపి 14 వికెట్లు కోల్పోగా.. ఇందులో తొమ్మిది వికెట్లు పేస్ బౌలర్లు తీశారు. అలాగని స్పిన్నర్లు సైలెంట్ గా ఏమీ లేరు.. వారు పరుగులను నిలుపుదల చేశారు.

    వాస్తవానికి బంతి, బ్యాట్ మధ్య సేమ్ లెవెల్ కోసం సిస్ గ్రాస్ అనే సంస్థ అమెరికాలో హైబ్రిడ్ పిచ్ లను రూపొందిస్తోంది. ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ట్రాక్ లలో సహజ సిద్ధంగా పెరిగిన గడ్డి, దాంతోపాటు ఐదు శాతం పాలిమర్ ఉంటుంది. వీటివల్ల బౌలర్లు స్థిరంగా బంతి నుంచి బౌన్స్ రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. పైగా పిచ్ పై చాలాసేపు తేమ ఉంటుంది. దీనివల్ల బౌలర్లు పదునైన బంతులు వేసేందుకు అవకాశం ఉంటుంది.

    అయితే ఇలాంటి మైదానాలపై కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తే వికెట్లు తీయడం పెద్ద కష్టం కాదని భారత బౌలర్లు తమ బౌలింగ్ ద్వారా నిరూపించారు. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో నిప్పు కణికల్లాంటి బంతులు వేసి ఆకట్టుకున్నారు. జూన్ 5న ఐర్లాండ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. అప్పటికి అమెరికా మైదానాలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. బ్యాటర్లు వచ్చి రాగానే బాదుడు మంత్రాన్ని ఎంచుకోకుండా.. నిదానంగా ఆడి.. సమయమనంతో బ్యాటింగ్ చేస్తే భారీగా పరుగులు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో బౌలర్లు తమ లైన్ అండ్ లెంగ్త్ కోల్పోకుండా బంతులు వేస్తే వికెట్లు పడగొట్టేందుకు ఆస్కారం లభిస్తుంది. అమెరికా మైదానాల ప్రకారం టీం ఇండియా నలుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగితే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.