https://oktelugu.com/

Hydra : జన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు ఎందుకు పడగొట్ట లేదంటే.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్

హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను పడగొడుతున్న హైడ్రా.. జన్వాడ ఫామ్ హౌస్, ఓవైసీ కాలేజీ, మల్లారెడ్డి కాలేజీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ వైపు వెళ్లలేదు. వాస్తవానికి ఈ నిర్మాణాలను కూడా హైడ్రా పడగొడుతుందని వార్తలు వచ్చాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2024 / 09:43 PM IST

    Commissioner Ranganath, Ranganath press meet

    Follow us on

    Hydra : ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టిన తర్వాత హైడ్రా మరింత దూకుడుగా వెళ్ళింది. అమీన్పూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను పడగొట్టింది.. కూకట్పల్లి నల్లచెరువు, ఇతర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను నేల కూల్చింది. “విల్లా రాణి” గా పేరుపొందిన ఓ లేడీ డాన్ కు చెందిన నిర్మాణాలను కూడా నేలమట్టం చేసింది. అయితే అప్పట్లో హైడ్రా పని తీరుపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో అమీన్పూర్ ప్రాంతంలో పడగొట్టిన నిర్మాణాలు హైడ్రాను ఇబ్బందికి గురిచేసాయి. హైడ్రా పడగొట్టిన నిర్మాణాలలో మొత్తం పేదలవే ఉన్నాయని.. భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా, సోషల్ మీడియా తెరపైకి సరికొత్త వాదనను తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇళ్లను పడగొట్టడం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించింది. భారత రాష్ట్ర సమితి పేదలకు ఇళ్ళను నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పడగొడుతుందని విమర్శించడం మొదలుపెట్టింది. ఇది సహజంగానే హైడ్రా దూకుడుకు బ్రేక్ వేసేలా కనిపించింది. ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో ఓ భవనాన్ని హైడ్రా పడగొడితే.. దాని యజమానులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు హైడ్రా పై తీవ్రంగా స్పందించింది.. తాము స్టే విధించినప్పటికీ కూడా ఎలా పడగొడతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను ప్రశ్నించింది. అసలు హైడ్రాకు ఏం అర్హతలు ఉన్నాయని నిలదీసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రంగనాధ్ కు ఆదేశాలు జారీ చేసింది. దీనికంటే ముందు రంగనాథ్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలను వెల్లడించారు.. ఇదే సమయంలో జన్వాడ ఫామ్హౌస్, ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు ఎందుకు కూల్చలేదో వివరణ ఇచ్చారు.

    అందుకే కూల్చలేదట

    జన్వాడ ఫామ్హౌస్ ను కేటీఆర్ ఉపయోగిస్తున్నారు. అది ఆయన స్నేహితుడిదని ఇటీవల కేటీఆర్ వెల్లడించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొట్టిన తర్వాత.. నేరుగా హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపు వెళ్తాయని ప్రచారం జరిగింది. కార్యక్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చకూడదంటూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. స్టే తీసుకువచ్చారు. దీంట్లో అప్పట్లో ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో జన్వాడ ఫామ్ హౌస్ ను ఎందుకు కూల్చలేదో రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ” జన్వాడ ఫామ్ హౌస్ 11 జీవో పరిధిలో ఉంది.. 11 జీవో అనేది హైదరాబాదులోకి రాదు.. హైడ్రాను ఒక బూచిగా చూపించి ప్రజలను భయపెట్టొద్దు. అలా చేస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. హైదరాబాద్ నగరం తీవ్ర భక్తుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజేశ్వర్ రెడ్డి, ఓవైసీ, మల్లారెడ్డి కాలేజీలను కూల్చకపోవడానికి ప్రధాన కారణం విద్యార్థుల భవిష్యత్తే. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ఆ భవనాల జోలికి వెళ్లలేదని” రంగనాథ్ వివరణ ఇచ్చారు. దీంతో విద్యా సంవత్సరం ముఖ్య గానే ఆ కాలేజీలను పడగొడతామని రంగనాథ్ చెప్పకనే చెప్పారు.