Hydra : హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలకొడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండడం.. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రంగనాథ్ పలు విషయాలపై స్పష్టత ఇచ్చారు. ” కొన్ని అక్రమ నిర్మాణాలను కూలగొడితే హైడ్రా బాగా పనిచేస్తున్నదని చెప్పారు. ఇప్పుడేమో కేవలం పేదలను మాత్రమే టార్గెట్ చేసిందని అంటున్నారు. ఇప్పటివరకు మేము అక్రమ నిర్మాణాల మాత్రమే పడగొట్టాం. అమీన్పూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయి. అమీన్పూర్ ప్రాంతంలో అధికారులు గతంలో ఓ ఆసుపత్రి పై చర్యలు తీసుకున్నారు. ఆయనప్పటికీ ఆ నిర్వాహకులు మళ్ళీ నిర్మించారు. మేము ఆసుపత్రిని పడగొడుతున్న సమయంలో అందులో రోగులు లేరు. దానికి సంబంధించి వీడియో కూడా రికార్డు చేసాం..ఎన్ కన్వెన్షన్ సెంటర్ పడగొడుతున్నప్పుడు.. దాని పక్కన పేదల గుడిసెలను మేము ముట్టుకోలేదు. ప్రజలు జీవిస్తున్న భవనాలను మేము పడగొట్టలేదు. మేము ముందస్తుగా సమాచారం ఇచ్చినప్పటికీ కొందరు అస్సలు ఖాళీ చేయడం లేదు. సరైన గడుగు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను పడగొడుతున్నాం. కూకట్పల్లి నల్ల చెరువులో ఇటీవల ఆక్రమణలను పడగొట్టాం. చెరువులను పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆక్రమించే సాహసం చేయరు. అక్రమ కట్టడాల వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. కేవలం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే ముఖ్యమంత్రి హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. చెరువులను అడ్డగోలుగా ఆక్రమిస్తుంటే.. నాలాలను కబ్జా చేస్తుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు కాకపోతే చెరువులను ఇంకెప్పుడూ కాపాడుకోవడం. నాలాలు సక్రమంగా ఉండాలి. వాటి పరిరక్షణ కూడా హైడ్రా బాధ్యత. పేదల ఇల్లను పడగొట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేది హైడ్రా లక్ష్యం కాదని” రంగనాథ్ పేర్కొన్నారు.
కూల్చివేతలు ఉంటాయి
మూసి పరిరక్షణ కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇందులో కొంతమంది ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు. దీంతో వారిని ఖాళీ చేయించడానికి అధికారులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందికరంగా మారింది. భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో బాధితుల గురించి పదే పదే ప్రస్తావిస్తుండడం .. హైడ్రా పనితీరును తప్పు పట్టే విధంగా పోస్టులు పెడుతుండడం.. ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. అందువల్లే రంగనాథ్ ను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. ఆయనతో సుదీర్ఘ వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో భవనాన్ని హైడ్రా కూల్చివేయడంతో హైకోర్టు స్పందించాల్సి వచ్చింది. సోమవారం తమ ఎదుట హాజరుకావాలని రంగనాథ్ ను హైకోర్టు ఆదేశించడం విశేషం. దానికంటే ముందుగానే రంగనాథ్ తన మనసులో మాట చెప్పడం.. భవిష్యత్తులోనూ అక్రమ నిర్మాణాలను పడగొడతామని సంకేతాలు ఇవ్వడం విశేషం. అంటే ఈ ప్రకారం ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదనే సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.