HomeతెలంగాణNagarjuna Sagar: నిలువునా కూలిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్‌.. ఆగస్టు 1న ఘటన.. బయటకు చెప్పని...

Nagarjuna Sagar: నిలువునా కూలిన సుంకిశాల రిటెయినింగ్‌ వాల్‌.. ఆగస్టు 1న ఘటన.. బయటకు చెప్పని ప్రభుత్వం.. షాకింగ్‌ లైవ్‌ వీడియో వైరల్‌!

Nagarjuna Sagar: తెలంగాణలో అతిపెద్ద, అతి పురాతన సాగునీటి ప్రాజెక్టు నాగార్జున సాగర్‌. కృష్ణానదిపై దీనిని నిర్మించారు. ప్రాజెక్టు ఎగువన శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం తర్వాత కృష్ణా నదిపై అల్మట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లు నిర్మించడంతో నాగార్జున సాగర్‌కు వరద తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు కొన్నేళ్లుగా నిండడం లేదు. మరోవైపు వేసవిలో డెడ్‌ స్టోరేజీకి చేరుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు తాగునీరు అండం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని డెడ్‌ స్టోరేజీలో కూడా హైదరాబాద్‌కు తాగునీటిని తరలించేందుకు చేపట్టిన సుంకిశాల పంప్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారు. పనులు జరుగుతున్నాయి. నాగార్జున సాగర్‌ నిండినా పంప్‌హౌస్‌లోకి నీళ్లు రాకుండా రక్షణగా కాంక్రీటు గోడ(రిటెయినింగ్‌ వాల్‌) నిర్మించారు. పది రోజులుగా సాగర్‌కు భారీగా వరద వస్తోంది. దీంతో పది రోజుల్లోనే ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి పూర్తిగా నిండింది. ఈ క్రమంలో ఆగస్టు 1న సుంకిశాల వద్ద పెద్ద ప్రమాదం తప్పింది. పంప్‌హౌస్‌ వద్ద నిర్మించిన రిటెయినింగ్‌ వాల్‌ నిలువునా కుప్పకూలింది. దీంతో సుంకిశాల పంప్‌హౌస్‌ నీటమునిగింది. నిత్యం వందమందికిపైగా కూలీలు పని చేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జలంలో కలిసిపోయింది. కూలీలు షిఫ్టు మారే సమయంలో ప్రమాదం జరుగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆగస్టు ఒకటో తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అర గంట ముందు.. ఆర గంట తర్వాతగానీ కూలి ఉంటే.. భారీగా ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

3 లక్షల క్యూసెక్కుల వరద..
నాగార్జున సాగర్‌కు పది రోజులుగా నిత్యం 3 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది. దీంతో జలాశయంలో నీటిబట్టం వేగంగా పెరిగింది. నీటిమట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసిం సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తిస్థాయిలో చేయలేదని తెలుస్తోంది. సాగర్‌లో నీటిమట్టం భారీగా తగ్గిన తర్వాతగానీ సుంకిశాల మరమ్మతులు మొదలయ్యేలా లేవు. ఎండకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టమవుతున్నది.

హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు..
హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం జలమండలి రోజుకు 270 మిలియన్‌ గ్యాలన్ల కృష్ణ జలాలను నాగార్జున సాగర్‌ నుంచి తరలించడం కోసం ఏఎమ్మార్పీ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కోదండాపూర్‌ వద్ద నిర్మించిన నీటిశుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాత పైప్‌లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే నాగార్జునసాగర్‌లో కనీసంగా 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఏఎమ్మార్పీ మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. అందుకే తరచూ వేసవిలో అత్యవసర మోటర్ల ద్వారా నీటిని పంపింగ్‌ చేయాల్సిన పరిస్థితి.

డెడ్‌ స్టోరేజీలో కూడా లిఫ్ట్‌ చేసేలా..
నాగార్జునసాగర్‌ జలాశయ డెడ్‌స్టోరేజీ సుమారు 492 అడుగుల నీటిమట్టం నుంచి కూడా జలాలను తరలించేందుకు వీలుగా సుంకిశాల పథకాన్ని చేపట్టారు. వాస్తవానికి ఇది 1980 దశకంలో రూపొందించిన పథకం కాగా.. స్థానిక రైతుల ఆందోళనలతో పక్కకుపెట్టారు. 2001–03లో చంద్రబాబు హయాంలో సుంకిశాల పథకాన్ని పక్కనపెట్టి, ఏఎమ్మార్పీ ద్వారా నగరానికి కృష్ణాజలాల తరలింపు పథకం మొదటి దశ పనులను పూర్తి చేశారు. అనంతరం కాలక్రమేనా మరో రెండు దశలు పూర్తయినా సుంకిశాల పట్టాలెక్కలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ.2,215 కోట్లతో ఈ పథకం పనులు మొదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌ వరకు పనులు జరిగాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మందకొడిగా సాగుతున్నాయి.

నీటిమట్టం పెరిగి ఒత్తిడి..
నాగార్జునసాగర్‌ డెడ్‌స్టోరేజీ నుంచి సొరంగ మార్గం ద్వారా సుంకిశాల వద్ద నిర్మించిన పంపుహౌజ్‌ వరకు నీటిని తరలించి, అక్కడ మోటర్లతో లిఫ్టు చేసి, పైప్‌లైన్ల ద్వారా కోదండాపూర్‌ వరకు జలాలను తరలించడమనేది ఈ పథకం స్వరూపం. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆధారంగా తెరిచేందుకుగాను మూడు స్థాయిల్లో (ఒక్కో లెవల్‌లో ఒక్కోటి చొప్పున) మూడు సొరంగ మార్గాలను నిర్మించారు. అయితే మొత్తం పథకం పనులు పూర్తయి, మోటర్లను బిగించిన తర్వాత సొరంగాలను వంద శాతం పూర్తి చేస్తారు. అప్పటివరకు నాగార్జునసాగర్‌ వైపు కొంతమేర తవ్వకుండా వదిలివేస్తారు. తద్వారా సాగర్‌లోని నీళ్లు సొరంగంలోకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా సొరంగాల ద్వారా పంపుహౌస్‌లోకి నీళ్లు వచ్చే ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా భారీస్థాయి రక్షణ గోడ (రిటెయినింగ్‌ వాల్‌) నిర్మించారు. ఇప్పటికే పథకంలో భాగంగా సుంకిశాల నుంచి కోదండాపూర్‌ వరకు పైప్‌లైన్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

భారీ సొరంగాలు..
ఎనిమిది మీటర్ల డయా (వ్యాసం)తో సొరంగ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. 82 మీటర్ల లోతులో ఉన్న పంపుహౌస్‌లో మోటర్ల ఏర్పాటుకుగాను ప్రాథమిక పనులను ఇటీవల మొదలుపెట్టారు. రానున్న రెండు నెలల్లోనే కొన్ని మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలనే ఉద్దేశంతో అధికారులు పది, పదిహేను రోజుల కిందట మధ్యస్థాయిలో ఉన్న సొరంగంలో రక్షణగోడకు వెనక భాగాన గేట్‌ అమర్చారు. ఎలాగూ గేటు, రక్షణ గోడ ఉన్నదనే భావనతో ఆ సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేశారు. దీంతో సాగర్‌లో రోజురోజుకీ నీటిమట్టం పెరుగుతుండటంతో గేటుపై జలాల ఒత్తిడి తీవ్రమైంది. ఈ పరిణామాన్ని ఇంజినీర్లు సరిగ్గా అంచనా వేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

క్షణాల్లోనే కుప్పకూలిన గోడ
పంపుహౌస్‌లో ప్రస్తుతం మోటర్ల బిగింపునకు సంబంధించిన సివిల్‌ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం పంపుహౌస్‌లో వందమందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో ఈ సంఖ్యలోనే కార్మికులు ఉంటారు. ఉదయం ఆరు గంటలకు పనిలోకి వచ్చిన వారు సాయంత్రం ఆరు గంటలకు, అప్పుడు పనిలోకి వచ్చిన వారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు పని నుంచి వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు వందమందికిపైగా కార్మికులు షిఫ్టు ముగించుకొని పంపుహౌస్‌ నుంచి వాహనంలో బయటికి వస్తున్నారు. బయటికి వచ్చిన సమయంలోనే పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా రక్షణ గోడ కుప్పకూలిపోయింది.

అంచనా లోపంతోనే..
ప్రమాదం జరగడం వెనక ఇంజినీర్లు అంచనా లోపమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి నాగార్జునసాగర్‌లో ఇంతస్థాయిలో నీటిమట్టం ఉండటంతోపాటు లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్న సమయంలో సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయకుండా ఉండాల్సిందని పలువురు సూచిస్తున్నారు. ఆ సమయంలో సాగర్‌లో సుమారు 528 అడుగుల నీటిమట్టం ఉండటంతోపాటు శ్రీశైలం నుంచి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతున్నది. ఈ సమయంలో దాదాపు 462–580 అడుగుల స్థాయిలో ఉండే సొరంగంలో గేటు అమర్చి, పూర్తిస్థాయిలో ఓపెన్‌ చేయడం వల్లనే జలాల ఒత్తిడికి అవి తాళలేకపోయాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular