Cold Weather: సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. చలి విస్తారంగా ఉంటుంది. అయితే ఈసారి చలి తీవ్రత అంతకుమించి అనేలాగా ఉంది. కేవలం పై జిల్లాలు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటిదాకా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండం వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో ప్రజలు బయటికి రావడానికే ఇబ్బంది పడ్డారు. చలితో గజ గజ వణికి పోయారు. ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడిన దాఖలాలు లేకపోయినప్పటికీ వాతావరణం మాత్రం విభిన్నంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంక్రాంతి దాకా చలి తీవ్రత అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో.. మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని హెచ్చరించింది. ఉష్ణోగ్రతలకు పడిపోవడమే కాకుండా మంచు కురుస్తుందని, చలి గాలులు వీస్తాయని హెచ్చరించింది. పొగ మంచు ఏర్పడుతుందని.. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పలు జిల్లాల్లో 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సాదరణం కంటే ఐదు డిగ్రీలకు పడిపోతున్నాయని వాతావరణ శాఖ వివరిస్తున్నది.. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చలి గాలుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. “కొంతకాలంగా ఉత్తర భారత దేశంలో క్రమంగా చలి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో సమూలంగా మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా సంక్రాంతి వరకు చలిగాలులు వీయడం సర్వసాధారణం. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. చలిగాలుల తీవ్రత ఇంకా తగ్గడం లేదు. ఈ వాతావరణం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం. కాకపోతే దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలపై అధికంగా ఉంది. మిగతా ప్రాంతాల్లోనూ పొగ మంచు కురుస్తోంది. దీనివల్ల వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వచ్చే మూడు రోజులు పాటు వాతావరణం ఇలానే ఉంటుందని ఉపగ్రహ చాయ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఈ మధ్యలో బంగాళాఖాతంలో గనుక అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడితే వాతావరణంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. అప్పుడు చలి కూడా పెరుగుతుంది. సాధారణంగా ఈ కాలం వరకు చలి కాస్త తగ్గుముఖం పట్టాల్సి ఉంది. కానీ తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పుడప్పుడే చలి తగ్గే అవకాశం లేదని” వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.