https://oktelugu.com/

TS Assembly Session: కాంగ్రెస్‌ను కడిగేసిన కేటీఆర్‌.. కౌంటర్‌ ఇచ్చిన సీఎం రేవంత్‌!

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేఢీ’గా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Written By: Raj Shekar, Updated On : December 16, 2023 4:09 pm

TS Assembly Session

Follow us on

TS Assembly Session: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం తిరిగి ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవే’ఢీ’గా చర్చ జరిగింది. సమావేశాలు ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ పేరును సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రకటించారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగం ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి బలపరిచారు.

వాడీవేడిగా చర్చ..
గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడీవేఢీ’గా చర్చ జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు.

కేటీఆర్‌ దూకుడు..
ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ ప్రసంగమంతా తప్పుల తడకగా, సత్యదూరంగా ఉందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ అడ్డు తగిలారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పారు. ప్రసంగం మొదలు పెట్టడమే కేటీఆర్‌ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. ‘రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా కట్టిన వ్యవస్థలు, సంస్థలను ధ్వంసం చేశారన్నారు. తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు.

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి?
తెలంగాణ రాకముందు బీడువారిన భూములు ఉండేవని, 10 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పాలనను విధ్వంసం అంటే.. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను ఏమనాలి? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇద్దామని కేసీఆర్‌ చెప్పారన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల పక్షమేనన్నారు. గత కాంగ్రెస్‌ పాలనలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని.. పదవుల కోసం పెదాలు మూసిన చరిత్ర కాంగ్రెస్‌ అని చెప్పారు.

చెప్పే ప్రయత్నం చేసినా తెలుసుకోరు..
కేటీఆర్‌ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘కొంతమంది ఎన్‌ఆర్‌ఎలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే అర్థం తెలియట్లేదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకోరు. సభ్యుల సంఖ్య ముఖ్యం కాదు.. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై పోరాడింది కాంగ్రెస్‌ నేతలే. కేసీఆర్‌కు వివిధ పదవులు ఇచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ. ఎమ్మెల్యే కాకుండానే హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్‌ రాజశేఖర్రెడ్డి’ అని చెప్పారు.

నాడు పీజీఆర్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు
సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని హరీశ్‌రావు కలగజేసుకున్నారు. ‘అప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టును ఆపాలని మేం కోరాం. ఆరు కారణాలతో మేం ఆ రోజు రాజీనామా చేశాం. అప్పట్లో మంత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఎవరూ మాట్లాడలేదు. ఒక్క పీజీఆర్‌ తప్ప ఎవరూ పోతిరెడ్డిపాడుపై మాట్లాడలేదు. మేం గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీకి భిక్షపెట్టాం. మేం పొత్తు పెట్టుకోవడం వల్లే నాడు కాంగ్రెస్‌ అధికారంలో వచ్చింది’’ అని తెలిపారు. ఆపై కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా ఢిల్లీ నామినేట్‌ చేసిన వ్యక్తి సీఎం అయ్యారు. పదేళ్లలో మహబూబ్‌నగర్‌లో వలసలు ఆగిపోయాయి. ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు అమ్ముకున్నది ఎవరో చెప్పాలి?. సోనియా గాంధీని బలిదేవత అన్నది ఎవరో అందరికీ తెలుసు. మేనిఫెస్టోలోని హామీలను కాంగ్రెస్‌ అమలు చేయాలి. కోటిన్నర మంది మహిళల ఖాతాలో రూ.2,500 వేస్తామన్నారు. డబ్బులు ఎప్పుడు ఇస్తారా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు. మేనిఫెస్టోలని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు.