Chandrababu: రాజకీయాలన్నాకా గెలుపు, ఓటములు అత్యంత సహజం. అయితే ఎన్నికల్లో పోటీ చేసే వారు గెలుపు కోసమే సర్వశక్తులు ఒడ్డుతారు. అయితే ప్రజల నమ్మకం ఎవరైతే చూరగొంటారో వారే విజయం సాధిస్తారు. విడిపోయిన తర్వాత ఏపీలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాయి.. ఆ తర్వాత టిడిపి నుంచి జనసేన పక్కకు వెళ్లిపోయింది. భారతీయ జనతా పార్టీ కూడా తన దారి తను చూసుకుంది. ఈ లోగానే ఎన్నికలు వచ్చాయి. అయితే ఈసారి ఏపీలో ఫ్యాన్ గాలి చాలా బలంగా వీసింది. ఏకంగా 150 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడుని ఏడిపించారు. ఆయనను జైలుకు కూడా పంపించారు. ఇక ఆయనకు వత్తాసు పలుకుతున్న పచ్చ మీడియాను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.. అయితే మరికొద్ది నెలల్లో ఏపీలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా మళ్ళి గెలవాలని జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చుతున్నారు. కొంతమందికి టికెట్లు ఇవ్వబోనని ముఖం మీదే చెప్పేస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో అధికార పార్టీని ఒక ఆట ఆడుకోవాల్సిన ప్రతిపక్ష టీడీపీ నేలబారు మాటలు మాట్లాడుతోంది. అది అంతిమంగా ప్రజల్లో చులకన చేస్తున్నది.
ఓడిపోతే రాను
జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల ఇటీవల చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి సహజంగానే జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వ పరిపాలన బాగోలేదని కామెంట్లు చేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది ఆయనకు ఈ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. ఇందులో ఎటువంటి తప్పులు తీయాల్సిన పనిలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక రాను అని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా.. అది చంద్రబాబు నాయుడు కు అర్థమైందా.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా.. ఊహగానాలు ఇప్పుడు ఏపీలో మొదలయ్యాయి. వాస్తవానికి ఎన్నికల్లో ఓడిపోయినా,గెలిచినా ప్రజల మధ్యలో ఉండాలి. అదే ఒక నాయకుడి లక్షణం. అంతేగాని ఓడిపోతే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాను అని చెప్పడం ఏ ప్రజాస్వామ్య లక్షణం? ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అధికారం మీద ఉన్న యావ ప్రజల మీద ఉండదా? ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే వచ్చే ఇబ్బంది ఏంటి? ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం ఇబ్బంది పెడితే పడ్డాడు కదా.. ఆస్తుల కేసులకు సంబంధించి 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు కదా.. ఏనాడు కూడా ఓడిపోతే ప్రజల మధ్యలో ఉండను అని చెప్పలేదు కదా.. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుంది.
ఇప్పుడు ఏపీలో వైసీపీలో ముసలం పుట్టింది అనేది నిజం. చాలామంది నాయకులు ఆ పార్టీని వీడుతున్న విషయం కూడా నిజం. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్షంగా మరింత బలం పెంచుకొని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే తలంపు టిడిపికి ఉండాలి. కచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడాలి. మరింత బలాన్ని కూడగట్టుకోవాలి. కానీ అలా చేయకుండా.. అలాంటి చర్యలు తీసుకోకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో ఎలాంటి భావన ఏర్పడుతుంది? ఇప్పటికే స్థానికంగా నివాసం ఉండకుండా హైదరాబాదులో చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. కరకట్ట సమీపంలో లింగంమనేని గెస్ట్ హౌస్ కు అప్పుడప్పుడు వస్తున్నారు. దీనిపై ఇప్పటికే అక్కడి వైసిపి నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి బలం చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల నుంచి దూరం చేస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎన్నికల్లో భారీ నష్టాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుందని మదనపడుతున్నాయి. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
నేను ఓడిపోతే మీ రాష్ట్రానికి రాను – చంబా#YSJaganAgain #CMYSJagan #JaganannaOnceMore#EndOfTDP pic.twitter.com/5TXEoc1MtQ
— andhra memers (@andhra_memers) December 15, 2023