CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఆందోళనలు, నిరసనలు చేపట్టారు రేవంత్‌రెడ్డి. బాసర ట్రిపుల్ ఐటీలో అయితే గోడ దూకి లోనికి ప్రవేశించారు. ఈ పోరాటాల ఫలితంగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఆందోళనకు దిగారు. సీఎంగా ఉండి ఆందోళన చేయడం ఏంటి అనుకుంటున్నారా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం నిరసనలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనలో పాల్గొన్నారు.
చలో రాజ్‌భవన్..
కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ.. అసెంబ్లీని వాయిదా వేసి మరీ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళనబాట పట్టారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకు పాదయాత్ర చేపట్టారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. రాజ్ భవన్ వద్దకు చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు.. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసుపై దర్యాప్తు జరిపించాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్రం అదానీకి కొమ్ము కాస్తోందని సీఎం విమర్శించారు. బీఆర్‌ఎస్ కూడా అదానీ వ్యవహారంపై నోరు విప్పడం లేదని మండిపడ్డారు. అదానీ అక్రమాలపై బీఆర్‌ఎస్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. సుమారు అరగంటపాటు నిరసన కొనసాగించారు.