CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టింది. దాంతో వచ్చిన అధికారాన్ని కాపాడుకునేందుకు.. ప్రజల్లో పాజిటివ్ తెచ్చుకునేందుకు నానా యాతన పడుతోంది. ఇందుకు ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలకు తెరతీస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఎన్నికల వేళ ఆరు గ్యారటీలంటూ హామీలిచ్చింది. ప్రజల కోసం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పింది. కానీ.. ఇంకా ఆ గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. అటు రైతు భరోసా లేక రైతుల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది.
ఇటీవల పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఎంపికయ్యారు. గాంధీభవన్ వేదికగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాగా.. పీసీసీ చీఫ్ ఓ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ఇక నుంచి వారంలో రెండు రోజులు రాష్ట్ర మంత్రులు తప్పనిసరిగా గాంధీభవన్ ను సందర్శించాలని కోరారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రెండు వారాలకు ఒక్కరోజు గాంధీభవన్‌లో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దాంతో ఈ అంశంపై సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ చాలా సేపు చర్చించారు. ఈ కార్యక్రమం మంచిదే అని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు కూడా బలపడుతాయని సీఎం అన్నారు.
ప్రతీ బుధ, శుక్రవారాల్లో మంత్రులు గాంధీ భవన్‌ను సందర్శించాలని టైమ్ నిర్ణయించారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని గత వారం నుంచే అమలు చేయాలని అనుకున్నప్పటికీ కేబినెట్ సందర్భంగా ఈ వారానికి వాయిదా పడింది. ఈ వారం నుంచి అమలు చేస్తున్నట్లు పీసీసీ ప్రకటించింది. వారికి కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటారు. దీనికి తాత్కాలికంగా మంత్రులతో ప్రజల ముఖాముఖి అనే నామకరణం చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లక్ష్యం ఎలా ఉన్నా ప్రజల నుంచి కొన్ని విమర్శలు వచ్చిపడుతున్నాయి.
ఈ మేరకు మంత్రుల సందర్శన షెడ్యూల్ కూడా ఖరారు చేశారు. రేపు ముందుగా మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్ వెళ్తున్నారు. అలాగే.. 27న శ్రీధర్ బాబు, అక్టోబర్ 4న ఉత్తమ్, 9న పొన్నం, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి, 18న సురేఖ, 23న పొంగులేటి, 25న జూపల్లి, 30న తుమ్మల ప్రజలతో భేటీ అవుతారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను హామీలుగా ఇచ్చింది. అందులో కొన్ని స్కీములు ఇంకా అమల్లోకి రాలేదు. ముఖ్యంగా రైతుల కోసం ఇచ్చిన రైతు భరోసా, మహాలక్ష్మి స్కీమ్ అమలుకు నోచుకోలేదు. రైతు భరోసా ద్వారా ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. ఇక మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 2500 చొప్పున ప్రతినెలా ఆర్థిక సహాయం చేస్తామన్నారు. వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి ప్రయోగాలకు తెరతీస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిలో లబ్ధి పొందడానికేనా అనే టాక్ కూడా నడుస్తోంది.