Bademian Chotemian Movie : భారీ బడ్జెట్ చిత్రాలను తీయడంలో బాలీవుడ్ ముందు ఉంటుందనే పేరుంది. దేశవ్యాప్తంగా హిందీ సినిమాలకు ఆదరణ ఎక్కువ ఉన్నందున అందరికీ నచ్చేలా దీనిని నిర్మించడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అనుకున్న స్థాయి కంటే మించిన బడ్జెట్ అవుతంది ఒక్కోసారి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి భారీ తారాగణాన్ని కూడా చేర్చుతూ ఉంటారు. అయితే అన్ని వేళలూ మనవి కావన్నట్లుగా.. అన్ని సినిమాలు అనుకున్న విజయాలు సాధించలేదు. దీంతో ఆ సినిమాలపై ఆశలు పెట్టుకున్న నిర్మాతలకు భారీ నష్టం కలుగుతుంది. ఈ క్రమంలో డైరెక్టర్, నిర్మాత, హీరోల మధ్య క్లాషేష్ వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో అలాంటి సంఘటన జరిగింది. ఓ సినిమా తీసినందుకు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదని డైరెక్టర్.. యూనియన్ కు 17 పేజీల ఫిర్యాదు చేశాడు. ఆ కథ లోకి వెళ్తే..
అక్షయ్ కుమార్, పృథ్వీరాజ్, టైగర్ ష్రాఫ్, సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లార్ కలిసి నటించిన ‘బడేమియా చోటేమియా’ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాను రూ.350 కోట్లు పెట్టి చిత్రీకరించారు. పూజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా అనుకున్న వసూళ్లు రాబట్టలేదు. కేవలం రూ.102 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో చిత్ర నిర్మాతలకు భారీ నష్టాన్ని చేకూర్చింది.
అయితే ఈ సినిమాకు పనిచేసిన అబ్బాస్ జాఫర్ తాజాగా డైరెక్టర్ యూనియన్ కు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాకు పనిచేసినందుకు తనకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ మేరకు 17 పేజీల పాటు తన స్టోరీనంతా చెబుతూ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈనోటా బయటకు వచ్చింది. చివరికి ఈ ఫిర్యాదు విషయం నిర్మాతల వద్దకు చేరింది. దీంతో వారు స్పందించారు.
ఈ సినిమా తీయడం వల్ల తమకు భారీ నష్టం జరిగిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమా తీసిన తరువాత తాము పూర్తిగా నష్టపోయామని చెప్పారు. అంతేకాకుండా తమ సంస్థలో పనిచేసే వారికి జీతాలు కూడా ఇవ్వలేదని చెబుతున్నారు.అయితే తాజాగా నిర్మాతలు వాషు భగ్నాని పోలీసులను ఆశ్రయించారు. ఈ సినిమా కోసం పనిచేసిన అబ్బాస్ జాఫర్ కావాలనే బడ్జెట్ కు మించి వెళ్లాడని అన్నారు. కుట్ర పూరితంగానే బడ్జెట్ పెంచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ అబ్బాస్ జాఫర్ షూటింగ్ సమయంలో అబుదాబి అధికారుల నుంచి తీసుకున్న సబ్సిడీ నిధులను స్వాహా చేశాడని ఆరోపించారు. అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్న క్రమంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాకపోయినా రెమ్యూనరేషన్ విషయంలో వివాదాలు ఏర్పడిన సమయంలో బీ టౌన్ తీసుకునే నిర్ణయంపై ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా సినిమా ప్లాప్ అయిన తరువాత ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న నేపథ్యంలో రెమ్యూనరేషన్ చెల్లిస్తారా? లేక డైరెక్టర్ అబ్బాస్ జాపర్ పై చర్యలు తీసుకుంటారా? అని అనుకుంటున్నారు.