CM Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను ర్యాగింగ్ చేయడం మానడం లేదు. గతేడాది నవంబర్‌లో బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అంశాన్ని నాటి పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. ఎన్నికల తర్వాత రెండూ విలీనం అవుతాయని, అందు కోసం ఢిల్లీ లిక్కర్ కేసీలో కీలకమైన కేసీఆర్ కూతురు కవితను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. ఈవిషయాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలుపులో.. బీజేపీ సీట్లు తగ్గించడంలో, బీజేపీని ఓడించడంలో ఇది చాలా వరకు పనిచేసింది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు, మేనిఫెస్టోలోని అంశాలు కాంగ్రెస్ కలిసి వచ్చాయి. అధికారంలోకి తెచ్చాయి. తర్వాత లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం హోదాలో ఇదే విషయాన్ని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో చేశారు. అయితే ఈసారి పెద్దగా వర్కవుట్ కాలేదు. బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించినా బీజేపీపై పెద్దగా ప్రభావం చూపలేదు. అప్పటికే కవితను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడం కూడా ఇందుకు కారణమైంది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. అయినా బీఆర్‌ఎస్‌ను ర్యాగింగ్ చేయడం మాత్రం మానలేదు రేవంత్‌రెడ్డి. ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీని కలిపి ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా ఆయన బీఆర్‌ఎస్, బీజేపీపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
మీడియాలో విస్తృత ప్రచారం..
ఇదిలా ఉంటే. బీఆర్‌ఎస్, బీజేపీ విలీనం అంశానికి మీడియా కూడా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. కాంగ్రెస్ తరచూ ఈ అంశాన్ని లేవనెత్తుతుండడం, దానికి మీడియా కూడా అదే స్థాయిలో ప్రచారం కల్పిస్తుండడంతో తెలంగాణలో దీనిపై చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేనిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ బీజేపీలో విలీన ప్రతిపాదన తేవడమే కారణమని చెప్పారు. దీంతో విలీన ప్రచారం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్ నాయకులు ఇది అబద్దపు ప్రచారమని ఎంత కొట్టి పారేసినా.. ఈ ప్రచారానికి తెర పడడం లేదు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో మారు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఉంటే, తమ ఆటలు సాగవని భావిస్తున్న వారే.. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రెండు పార్టీలను కలిపి…
తాజాగా ఢిల్లీలో మాట్లాడిన సీఎం రేవంత్‌ఎడ్డి బీఆర్‌ఎస్, బీజేపీ విలీన అంశం కొలిక్కి వస్తోందన్నారు. విలీనం జరిగితే ఎవరికి ఏయే పదవులు ఇవ్వాలన్న విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సీఎం రెండు పార్టీలను ఇరికించేశారు. విలీనం పూర్తయితే కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్రంలో మంత్రి పదవి, కేసీఆర్ కూతురు కవితకు రాజ్య సభ ఎంపీ పదవి ఇచ్చేందుకు కూడా ఒప్పందం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతోబీఆర్‌ఎస్, బీజేపీ విలీన అంశం మరోమారు చర్చనీయాంశమైంది.
కేటీఆర్ ఏమన్నారంటే..
‘వాడోకడు, వీడొకడు తయారైండు. బీఆర్‌ఎస్ ఇక ఉండదు. బీజేపీలో విలీనం అవుతదని అడ్డమైన ప్రచారం చేస్తుండ్రు. ఈ పార్టీ ఉండొద్దని, నాశనం కావాలని కోరుకుంటున్నరు. నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను. కవిత అన్నను. ఇవ్వాళ్టికి మా ఇంటి ఆడబిడ్డ జైల్లో ఉండబట్టి 150 రోజులు. నేను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో బెయిల్ కోసం మాట్లాడొద్దా. కవితకు ధైర్యం చెప్పొద్దా. ఏమన్న అంటే బీజేపీ కాళ్లు మొక్కిండు, లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా..? ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా..? మా పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ 24 ఏళ్లు పార్టీ విజయవంతంగా కొనసాగింది. మరో 50 ఏళ్లు కొనసాగేలా బలంగా తయారు చేసుకున్నం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆరోపణలు అందుకే..
రాష్ట్రంలో పది లోక్ సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ కావాలనే సాధారణ అభ్యర్థులను పోటీకి పెట్టిందని.. తమ గెలుపు అవకాశాలని దెబ్బకొట్టేందుకు బీజేపీకి సహకరిస్తోందని రేవంత్ ఆరోపించారు. బీజేపీ బి–టీమ్‌గా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్టయ్యారు. 150 రోజులుగా జైలులో ఉన్నారు. లిక్కర్ కేసులో బెయిల్ దొరకడం లేదు. దీంతో తాజాగా కవితను బయటకు తీసుకువచ్చేందుకు బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని బీఆర్‌ఎస్ ఎంతగా ఖండించినా ప్రచారం ఆగలేదు.
బీఆర్‌ఎస్‌కు బీటలు..
పార్లమెంటు ఎన్నికల పలితాల తర్వాత బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ బాట పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వరసకట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోందని, అసలు బీఆర్‌ఎస్ శాసన సభాపక్షం లేకుండా పోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని అడ్డుకోలేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం.. అయిదు నెలలుగా కవితకు బెయిల్ రాకపోవడం వంటి కారణాలతో.. బీఆర్‌ఎస్ పని అయిపోయిందనే పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీలో విలీనం అవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి.