CM Revanth Reddy: నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇదే క్రమంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో వచ్చే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరంగల్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అటు ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Also Read: మనిషివా.. ‘ట్రంప్’ వా?
ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షా భావ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు నైరుతి రుతుపవనాల కదలిక.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్.. మంత్రులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. వచ్చే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కింది స్థాయి ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు.
హైడ్రా 24 గంటల పాటు పనిచేయాలని.. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యం, నీటిపారుదల శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. వరద ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్ సరఫరా విషయంలో స్థానిక పరిస్థితుల బట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో స్కూళ్లు, కాలేజీలు నడపాలా? వద్దా? అనేది అక్కడ విద్యాశాఖ అధికారులు నిర్ణయించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు..