CM Revanth Reddy: విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడే మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆయన మనసులో ఏమీ దాచుకోరు. తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. ఆ మధ్య తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై మొహమాటం లేకుండా అసలు విషయం చెప్పారు. తనను ఎవరూ దేకడం లేదని.. దొంగను చూసినట్టు చూస్తున్నారని.. చెప్పులు ఎత్తుకుపోయే వ్యక్తిలాగా భావిస్తున్నారని.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ వ్యాఖ్యలు సగటు తెలంగాణ వాదికి ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి బయటపెట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి. పైగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేందుకు ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించరు.
రాజకీయాలలో వ్యూహాత్మకతను పాటించడం ఒక ఎత్తు అయితే.. దూకుడుగా వెళ్లడం మరొక ఎత్తు. ఈ రెండిట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రెండవ దానిని మాత్రమే ఎంచుకుంటారు. ఎందుకంటే ఆయన దూకుడు తనాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టే ఇక్కడిదాకా వచ్చారు. బలమైన భారత రాష్ట్ర సమితిని.. బలమైన కెసిఆర్ ను అధిగమించి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ ఆయన స్థానంలో మరొక వ్యక్తి గనుక ఉండి ఉంటే ఇక్కడదాకా వచ్చి ఉండేవారు కాదు. ఇక్కడ దాకా ప్రస్తానాన్ని కొనసాగించేవారు కాదు. కాకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తన దూకుడును తగ్గించుకోవడం లేదు. కొంతమందికి ఇది ఇబ్బందికరంగా.. మరి కొంతమందికి నచ్చినట్టుగాను కనిపిస్తోంది. తాజాగా కూడా రేవంత్ రెడ్డి తన దూకుడును ప్రదర్శించారు. ఈసారి ఏకంగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు.
గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వంలో రెండుసార్లు పేపర్ లీక్ అయింది. దీంతో రెండుసార్లు కూడా నిర్వహించిన పరీక్ష వృధా అయ్యింది. ఒకరకంగా గులాబీ పార్టీ మూడోసారి అధికారాన్ని కోల్పోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా నిలిచింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పరీక్ష నిర్వహించారు. అయితే దీనికి సంబంధించి రకరకాల ఆరోపణలు.. రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి తోడు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రూప్ వన్ ఫలితాలపై సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మూడు కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారని తెరపైకి ప్రచారం వచ్చింది. దీనిని గులాబీ పార్టీ విస్తృతంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసింది. ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. గ్రూప్ వన్ అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు రావడంలో విజయవంతమైంది. ఫలితం అనుకూలంగా రావడంతో ఫలితాలను ప్రకటించడం.. వారికి నియామక పత్రాలు అందించడం.. ఇలా అన్నీ త్వర త్వరగా జరిగిపోయాయి. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ గ్రూప్ వన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు..
” గ్రూప్ వన్ ఉద్యోగాలను నేను మూడు కోట్లకు అమ్ముకున్నట్టు కొందరు దుష్ప్రచారం చేశారు. మూడు కోట్లు కాదు కదా కనీసం అభ్యర్థులతో చాయ్ కూడా తాగలేదు. కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేసినప్పటికీ తట్టుకున్నాను. కేసులు వేసినప్పటికీ భరించాను. గ్రూప్ వన్ అభ్యర్థుల భవిష్యత్తు కోసం నేను పోరాడాను. వారికి ఉద్యోగాలు కల్పించాలని నోటిఫికేషన్ కూడా వేశాను. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందుకు వెళ్లాను. ఎందుకంటే నిరుద్యోగుల బాధ ఏమిటో నాకు తెలుసు. కొంతమంది చేసిన పనికిమాలిన ప్రచారం కొద్దిరోజుల పాటు వేదనకు గురి చేసిందని” రేవంత్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ మాట్లాడుతున్నంత సేపు గ్రూప్ వన్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చప్పట్లు కొట్టి అభినందించారు. తామంతా కష్టపడి ఉద్యోగాలు సాధించామని ఉద్వేగంగా మాట్లాడారు.