CM Revanth Reddy: ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల రాజధానులలో కార్యాలయాలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలో వ్యక్తిస్వామ్యం నడుస్తుంది కాబట్టి.. ఆయన చెప్పినట్టుగానే పదవుల కేటాయింపు జరిగిపోతుంది. ఇది మనదేశంలో అత్యంత సర్వసాధారణమైన విషయం. అదే జాతీయ పార్టీ అయితే ఢిల్లీలో కార్యాలయాలు ఉంటాయి.. చాలామంది పెత్తనాలు సాగుతూ ఉంటాయి కాబట్టి.. ప్రతి విషయంలోనూ మంతనాలు జరుగుతూ ఉంటాయి.
జాతీయ పార్టీలో నాయకులు ఒక్కో తీరుగా ఉంటారు. అందరిని సమన్వయం చేసుకొని.. అందరిని మచ్చిక చేసుకొన్న తర్వాతే పదవులు లభిస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. అందువల్లే ఆ పార్టీలో ఏదైనా సాధ్యమే అనే నానుడి కూడా పుట్టింది. ముఖ్యమంత్రిలను కీలుబొమ్మలు లాగా మార్చి.. వారితో ఆటలాడించే పార్టీగా కాంగ్రెస్ కు జాతీయ రాజకీయాలలో మంచి పేరే ఉంది. అక్కడ దాకా ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రులను మార్చి కాంగ్రెస్ పార్టీ తన పేరును మరొకసారి సార్ధకం చేసుకుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు రోశయ్యను పక్కనపెట్టి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రికార్డు కిరణ్ కుమార్ రెడ్డి సొంతం చేసుకున్నారు.. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రం విడిపోయింది.. రెండు ముక్కలైంది. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు భారత రాష్ట్ర సమితి అధికారాన్ని అనుభవించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకసారి టిడిపి.. మరొకసారి వైసిపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని దక్కించుకుంది.
Also Read: KTR Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిని మీడియా ఎందుకు కాపాడుతోంది?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పరిపాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టింది. అందులో ముగ్గురికి మంత్రి పదవులు లభించాయి. వారంతా కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. ఈ క్రమంలో వారికి కేటాయించిన శాఖల విషయంలో అనేక మతలబు జరిగింది. కనుక సందర్భంలో ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్ శాఖను తనకు కావాలని కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీలో భారీ స్థాయిలో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి హస్తిన వెళ్లిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయిందని.. తన వద్ద ఉన్న కార్మిక శాఖ, ఎస్సీ , ఎస్టీ, దివ్యాంగులు, పశుసంవర్ధక శాఖలను మాత్రమే ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తన వద్ద ఉన్న విద్య, హోం, మున్సిపల్ శాఖలను ఇవ్వడానికి ఒప్పుకోనట్లు తెలుస్తోంది. వాస్తవానికి తన వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇస్తానని హస్తినలో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో తమకు కీలక శాఖలు దక్కుతాయని.. కొత్తగా ఏర్పడిన మంత్రులు భావించారు. కానీ అది అంత సులభం కాదని రేవంత్ రెడ్డి నిరూపించారు. కాకపోతే అధిష్టానం అనుమతి తీసుకుని తనకు అనుకూలంగా వ్యవహారాల సాగేలా రేవంత్ పావులు కదిపారు. దీంతో కొత్తగా ఏర్పడిన మంత్రులకు నామమాత్రంగా శాఖలు దక్కాయి. మంత్రి పదవవైతే దక్కింది చాలు.. శాఖల సంగతి తర్వాత అన్నట్టుగా.. ఆ మంత్రుల శైలి ఉన్నట్టు తెలుస్తోంది.