CM Revanth Reddy: రాజకీయాలలో ఉన్న వారంతా వ్యూహాలు రచిస్తుంటారు. అందులో కొంతమంది వ్యూహాలు మాత్రమే సఫలీకృతం అవుతుంటాయి. తెలంగాణ రాజకీయాలలో వ్యూహాలు రచించి.. పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మొదటి నుంచి కూడా కేసీఆర్ అగ్రస్థానంలో ఉండేవారు. 2014 నుంచి 2018 వరకు ఆయన వ్యూహాలు తెలంగాణలో విజయవంతం అయ్యాయి. ఎప్పుడైతే రెండు ఉప ఎన్నికలలో ఓటమి.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో.. కెసిఆర్ కు బ్యాడ్ టైం మొదలైంది. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు మీడియాను తన అదుపులో ఉంచుకునేవారని.. భయభ్రాంతులకు గురి చేసేవారని ఆరోపణలు వినిపించేది. ఇప్పుడు కెసిఆర్ అధికారానికి దూరం కావడంతో.. కేవలం గులాబీ మీడియా మాత్రమే ఆయన దండకం చదువుతోంది. ఇక మిగతా మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆర్థికంగా బలమైన, రాజకీయంగా శక్తివంతుడైన కేసీఆర్ ను ఎదిరించి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విజయవంతం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మూడోవంతు స్థానాలను గెలుచుకోవడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులయ్యారు. ఇదే ఊపులో పురపాలకం, నగర పాలక ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు.. గులాబీ మీడియా, గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా ప్రతిరోజు బురద చిమ్ముతున్నప్పటికీ.. ఇష్టానుసారంగా విష ప్రచారం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా తనకు ఎదురవుతున్న ప్రతిబంధకాల నుంచి విజయ పాఠాలు నేర్చుకుంటున్నారు.
ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ స్వగృహానికి వెళ్లారు. ఆయనతో చాలాసేపు మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే రాజకీయంగా వ్యూహాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి కాస్త విభిన్నమైన శైలి. ముఖ్యంగా మీడియాతో అనుకూలంగా ఉండడం.. మీడియా పెద్దల సలహాలు తీసుకోవడంలో రేవంత్ రెడ్డి ఎప్పటికీ ముందు వరుసలో ఉంటారు. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఎన్టీవీ, టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు వెళ్లారు. తనకు సపోర్ట్ ఇవ్వాలని కోరారు. ఆ చానల్స్ యాజమాన్యాలతో నేరుగా భేటీ అయ్యారు.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన ఆవశ్యకతను వారికి చెప్పారు. వారి దగ్గర నుంచి సలహాలు కూడా స్వీకరించారు. వాటిని రేవంత్ రెడ్డి అమల్లోపెట్టి అధికారంలోకి వచ్చారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ మీడియా సంస్థలను దూరం పెట్టలేదు. అలాగని తనకు భజన చేసుకునే మాధ్యమాలుగా మార్చుకోలేదు. ప్రభుత్వపరంగా తాను వేగంగా పరిపాలన సాగిస్తూనే.. మీడియా పరంగా ఆ చానల్స్ యాజమాన్యాల సపోర్ట్ కోరారు. తద్వారా యాజమాన్యాలు కూడా రేవంత్ కు సుముఖంగా మారిపోయాయి. ఫలితంగా రేవంత్ చాణక్యం ఫలవంతమై.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త శకాన్ని ఆవిష్కరిస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీపై ఏమాత్రం ప్రజలకు నమ్మకం లేని స్థితిలో.. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు అందుకున్నారు. సీనియర్ విమర్శలు చేస్తున్నప్పటికీ.. కుర వృద్ధులు అడ్డగోలుగా మాట్లాడుతున్నప్పటికీ.. కెసిఆర్ అడ్డు పుల్లలు వేస్తున్నప్పటికీ.. వాటన్నింటిని తట్టుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ దాకా వచ్చారు. రాజకీయాలలో చాణక్యాన్ని ఎలా ప్రదర్శించాలో నిరూపించి చూపిస్తున్నారు. ఇదే సమయంలో తాను వేస్తున్న ఉచ్చుల్లో గులాబీ పార్టీ నాయకులు పడి గిలగిల కొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ప్రదర్శిస్తోంది.. కాకపోతే అధికారంలోకి ఉన్నామని రేవంత్ రెడ్డి తల బిరుసుతనాన్ని ప్రదర్శించడం లేదు. కేవలం ప్రజలు ఇచ్చిన అవకాశం లాగానే దీన్ని చూస్తున్నారు. అందువల్లే గులాబీ పార్టీ నేతలు ఏ స్థాయిలో ఆరోపణలు చేసినప్పటికీ.. రేవంత్ రెడ్డికి వ్యతిరేక ఫలితం రావడం లేదు. వ్యతిరేక స్వరం వినిపించడం లేదు.