Telangana Symbol: తెలంగాణ కొత్త అధికారిక లోగో ఇదే.. ఫైనల్‌ చేసిన సీఎం?

తెలంగాణ లోగో, తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన కీలక మార్పులపై చర్చించేందుకు, ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం(మే 30న) సాయంత్రం 4 గంటలకు అక్షిలపక్ష సామావేశం ఏర్పాటు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : May 30, 2024 12:00 pm

Telangana Symbol

Follow us on

Telangana Symbol: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ అంటే కాంగ్రెస్‌ అనేలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంతకాలం తెలంగాణ అంటే కేసీఆర్‌ అని ఉన్న ముద్రను చెరిపేస్తోంది. ఈ క్రమంలో టీఎస్‌ స్థానంలో టీసీ తీసుకువచ్చింది. ఇక తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణతల్లి విగ్రహంలో మార్పులు చేసింది. తెలంగాణ అధికారిక గీతాన్ని ఫైనల్‌ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 2న అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకల్లో వీటిని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ గీతం గురించి అందరికీ తెలిసినా తెలంగాణ కొత్త లోగో ఎలా ఉంటుంది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉంటుంది అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది.

సీఎం ప్రత్యేక చొరవ..
తెలంగాణ తల్లి, తెలంగాణ అధికారిక లోగో విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉద్యమ స్ఫూర్తి స్పురించేలా తెలంగాణ తల్లి విగ్రహం, రాచరిక పోకడలు లేకుండా తెలంగాణ లోగో తయారు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో కలిసి పలు లోగోలు తయారు చేయించారు. అనేక సూచనలు, సలహాలతో మార్పులు చేర్పులు చేశారు. చివరకు తుది లోగోలు ఫైనల్ చేశారు.

అఖిలపక్ష సమావేశం..
తెలంగాణ లోగో, తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన కీలక మార్పులపై చర్చించేందుకు, ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం(మే 30న) సాయంత్రం 4 గంటలకు అక్షిలపక్ష సామావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు అన్ని పార్టీలకు సమాచారం అందించారు. అంతకు ముంద సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, శాసన మండలి సభ్యుడు కోదండరామ్, లోగో డిజైనర్‌ రుద్ర రాజేశంతో సమావేశం నిర్వహించారు.

మూడింటిలో ఒకటి ఫైనల్‌..

1. ప్రభుత్వం ఎంపిక చేసిన చిహ్నాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మొదటి దాంట్లో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో చార్మినార్‌ కనిపిస్తుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు నాలుగు (హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ) భాషల్లో ఉంటాయి. మధ్యలో పూర్ణకుంభం.. చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్‌ చేశారు.

2. రెండో లోగోలో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో ట్యాంక్‌ బండ్‌లో ఉండే గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు నాలుగు భాషల్లో ఉంటాయి. మధ్యలో తెలంగాణ రాష్ట్ర మ్యాప్, అందులో పూర్ణకుంభం.. చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్‌ చేశారు.

3. ఇక మూడోలోగో పైభాగం మధ్యలో మూడు సింహాల ముద్ర ఉంటుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం.. అనే అక్షరాలు నాలుగు భాషల్లో ఉంటాయి. మధ్యలో పైభాగంలో నీలం రంగులో ఆరు ఆకులు, కింది భాగంలో పారిశ్రామిక ప్రగతిని సూచించే చట్రాన్ని పొందుపర్చారు.

ఈ మూడు డిజైన్లలో మొదటిది లేదా రెండోది ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.