Health Insurance: ఆరోగ్య బీమా పాలసీల విషయంలో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారు ఆస్పత్రిలో చేరి, బీమా కోసం క్లెయిం చేసిన గంటలోపే నగదు రహిత చికిత్స(క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ఆథరైజేషన్)పై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి నుంచి ఫైనల్ బిల్లు వచ్చాక, 3 గంటల్లో తుది అనుమతి(ఫైనల్ ఆథరైజేషన్) ఇవ్వాలని స్పష్టం చేస్తూ బుధవారం మాస్టర్ సర్క్యులర్ విడుదల చేసింది. బీమా ఉత్పత్తులపై వివిధ సందర్బాల్లో జారీ చేసిన 55కేపైగా ఆదేశాల్లోని నిబంధనలను క్రోడీకరించి ఈ మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది. బీమా తీసుకునేటప్పుడు, క్లెయిం పరిష్కారాలకు సంబంధించిన అనుభవాన్ని మెరుగుపర్చేందుకు ఇది పాలసీదారులకు మార్గదర్శిగా ఉంటుంది.
ఆ మూడు అవసరం లేదు..
ఆరోగ్య బీమా చేసే సమయంలో బీమా సంస్థలు ప్రస్తుతం వయసు, ప్రాంతం, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా పాలసీ ఇస్తున్నాయి. ఇకపై ఈ మూడింటితో నిమిత్తం లేకుండా ఆరోగ్య బీమా పాలసీని బీమా సంస్థలు అందించాలి. ప్రీమియం చెల్లించే సామర్థ్యం ఆధారంగా అందుబాటులో ఉన్న పాలసీల్లో నచ్చినది ప్రజలు ఎంచుకుంటారు. ఇక అవసరాన్ని బట్టి, రకరకాల పాలసీలను రూపొందించే అవకాశం బీమా సంస్థకు ఉంది.
సీఐఎస్ ఇవ్వాలి..
ప్రతీ పాలసీ పత్రంతోపాటు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్(సీఐఎస్) అందించాలి. బీమా పాలసీ రకం, బీమా కవరేజీ మొత్తం, కవరేజీ వివరాలు, పాలసీదారులకు లభించే మినహాయింపులు, తగ్గింపులు, వేచి ఉండే కాలం వంటివి ఇందులో వివరించాలి. పాలసీ తీసుకునేందుకు, పాలసీ పునరుద్ధరణ, సేవలు, ఫిర్యాదుల పరిష్కారం తదితరాల కోసం అవసరమైన సాంకేతిక సేవలను అందించాలి.
క్లెయిమ్ చేసుకోకుంటే..
పాలసీ వ్యవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు లేకపోతే బీమా మొత్తాన్ని పెంచడం, ప్రీమియం మొత్తాన్ని తగ్గించడం, నో క్లెయిమ్ బోనస్ ఎంచుకోవడం ఏదో ఒకదానిని ఎంచుకునే సౌలభ్యం పాలసీదారులకు సంస్థ కల్పించాలి. ఒకటికి మించి పాలసీలు ఉన్నప్పుడు ఏ పాలసీని ప్రాథమికంగా క్లెయిం చేసుకోవాలన్నది పాలసీదారు నిర్ణయించుకోవచ్చు. బిల్లు అధికంగా అయినప్పుడు మొదటి బీమా సంస్థ, మరో బీమా సంస్థతో సమన్వయం చేసుకుని ఆ మొత్తాన్ని చెల్లించేలా చూడాలి.
నగదు రహిత చికిత్సపై..
100 శాతం నగదు రహిత చికిత్స అందించేలా బీమా సంస్థ తగిన చర్యలు నిర్ణీత సమయంలో తీసుకోవాలి. ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రుల వివరాలను తమ వెబ్‌సైట్లలో సంస్థ తప్పనిసరిగా పేర్కొనాలి. ఒకవేళ ఒప్పందం లేని ఆస్పత్రిలో పాలసీదారు చేరితే, పాటించాల్సి విధానాలను తెలియజేయాలి.
పోర్టబిలిటీకి దరఖాస్తు..
ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా(ఐఐబీ) పోర్టల్‌లో ఆరోగ్య బీమా పాలసీల పోర్టబిలిటీకి దరఖాస్తు చేసినప్పుడు రెండు బీమా సంస్థలూ నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలి. బీమా అంబుడ్స్‌మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనిపక్షంలో బీమా సంస్థ, పాలసీదారుకు రోజుకు రూ.5 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. చికిత్స సమయంలో పాలసీదారు మరణిస్తే మృతదేహానిన వెంటనే బంధువులకు అప్పగించాలని ఐఆర్‌డీఏఐ పేర్కొంది.