CM Ramesh vs KTR: భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనానికి ప్రయత్నాలు చేసింది. విలీనం కోసం సంప్రదింపులు జరిపారు.. ఈ సంప్రదింపులు ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నుంచి వచ్చాయి. అవన్నీ కూడా నా గృహంలోనే జరిగాయి. ఈ విషయాన్ని నేను పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తే వారు వద్దన్నారు. నాడు కవిత జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి పార్టీని తాకట్టు పెట్టడానికి కూడా ఆయన వెనుకాడ లేదు.. ఇవీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ చేసిన ఆరోపణలు. సహజంగానే ఈ ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించాయి. గతంలో భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనానికి సంబంధించి చర్చలు జరిగాయని.. కాకపోతే వాటిని నేను ఒప్పుకోలేదని కవిత కూడా ఇటీవల వ్యాఖ్యానించడంతో సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చాయి.
Also Read: జాగృతి లీడర్.. కవిత అడుగులు దేన్ని సూచిస్తున్నాయి..
సీఎం రమేష్ మాటలను ఓవర్గం మీడియా విపరీతంగా ప్రచారం చేయడంతో.. సహజంగానే భారత రాష్ట్ర సమితి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సీఎం రమేష్ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను లక్ష్యంగా తీసుకొని విమర్శలు చేయడం.. ఆ విమర్శలు కూడా అత్యంత వివాదాస్పదంగా ఉండడంతో ఒక్కసారిగా సంచలనం కలిగింది. అయితే ఇది పార్టీకి నష్టం చేకూర్చే పరిణామం కావడం.. పైగా ఇటీవల కల్వకుంట్ల కవిత పార్టీకి దూరంగా ఉండడం.. ఇవన్నీ కూడా ఒక రకంగా ఇబ్బందికరంగా మారాయి. దీంతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించక తప్పలేదు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి
వాస్తవానికి సీఎం రమేష్ చేసిన ఆరోపణల తర్వాత కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్లో సుదీర్ఘ ట్వీట్ చేశారు. భారత రాష్ట్ర సమితి పుట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఎన్నో విలీనానికి సంబంధించిన వార్తలు వచ్చాయని.. అవన్నీ కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయని.. భారత రాష్ట్ర సమితి మాత్రం అలాగే ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విలీనం లేదా పొత్తులకు సంబంధించిన మాటలను తాము కొత్తగా వినడం లేదని.. సంవత్సరాలుగా ఇవన్నీ వినిపిస్తూనే ఉన్నాయని.. వీటన్నిటిని దాటుకొని భారత రాష్ట్ర సమితి రెండుసార్లు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుందని.. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కచ్చితంగా అధికారాన్ని దక్కించుకుంటుందని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారని కేటీఆర్ ఆరోపించారు. ఇదంతా కూడా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఒక్కటై ఆడుతున్న నాటకం అని.. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసని.. తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రక్షణగా భారత రాష్ట్ర సమితి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి ఏ పార్టీలో కూడా విలీనం కాదని.. సింగిల్గానే పోటీ చేస్తుందని.. కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రమేష్ చేసిన ఆరోపణలను పసలేని వని కేటీఆర్ కొట్టి పారేశారు. పార్టీ కార్యవర్గం సమర్థవంతంగా ఉండాలని.. ఇలాంటి ఆరోపణలను ధైర్యంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు..