CEC Rajiv telangana Elections
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలపై కేంద్రం నజర్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండి మరీ అధికారులతో వివిధ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణపై సమీక్షించడంతో ఈసారి ఎన్నికలపై ఈసీ పకడ్బందీగా ముందుకెళుతున్నట్టుగా అర్థమవుతోంది.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి గెలవడానికి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ స్థాయికి ఎదిగిన ఈ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే తనకు మద్దతిస్తే జాతీయ స్థాయిలో రాష్ట్రాల్లో పార్టీలకు ఆర్థికసాయం చేయడానికి కూడా రెడీ అని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అంతలా డబ్బులతో మేనేజ్ చేయగల సత్తా కేసీఆర్ పార్టీకి ఉందని కేంద్రంలోని బీజేపీకి, ఈసీకి తెలుసు. అందుకే ఈ టైట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై మూడు రోజుల పాటు అధికారులతో సమీక్షించిన అనంతరం సంచలన కామెంట్స్ చేశారు. ‘తెలంగాణ ఎన్నికల నిర్వహణలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం సరఫరా.. నగదు పంపిణీ, గిఫ్టుల డిస్ట్రిబ్యూషన్ లాంటివి సవాలుగా మారాయని.. వీటిని కట్టడి చేసి పారదర్శకంగా నిర్వహించడంపై ఫోకస్ చేసినట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రలోభాలను కంట్రోల్ చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామన్నారు. బ్యాంకు అకౌంట్లపై దృష్టి పెట్టామని.. డిజిటల్ లావాదేవీల ద్వారా నిఘా ఉంటుందన్నారు. ఇందులో మొత్తం 21 ఎన్ ఫోర్స్ మెంట్ మెంట్ ఏజెన్సీల ద్వారా సహకారాన్ని తీసుకొని సమన్వయం కోసం పకడ్బందీ మెకానిజం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గతంలో జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచిపెట్టిన సంఘటనలు జరిగాయని, వీటిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, డబ్బులు అందనివారు రోడ్ల మీద ధర్నాలు కూడా చేశారని గుర్తుచేశారు. అందుకే ఈసారి తెలంగాణ ఎన్నికల్లో వీటిపై కీలకంగా దృష్టిసారించినట్టు ఈసీ తెలిపారు.
చూస్తుంటే కేంద్రం పెద్దలు తెలంగాణ ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, డబ్బుల పంపిణీపై ఉక్కుపాదం మోపేందుకు సమాయత్తం అయినట్టుగా కనిపిస్తోంది.