MLC Kavitha: మరో షాక్.. ఇలాగైతే కల్వకుంట్ల కవిత విడుదల ఎప్పుడు?

ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పటివరకు కవిత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉంది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 11, 2024 4:18 pm

MLC Kavitha

Follow us on

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పలు దఫాలుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారించారు.. ఆమె విచారణకు సహకరించడం లేదని.. మరి కొద్ది రోజులు ఆమెను కస్టడీలోకి ఇవ్వాలని విజ్ఞప్తి కూడా చేశారు. అది అలా ఉండగానే ఈ కేసులోకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎంట్రీ ఇచ్చింది. కవితను విచారించాలని కోర్టుకు విన్నవించింది. దీంతో సిబిఐ విజ్ఞప్తిని కోర్టు సమ్మతించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ కవిత తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి మాకు కొంచెం సమయం కావాలని సిబిఐ కోర్టు ఎదుట విన్నవించింది. ఇది జరుగుతుండగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం మరో కీలక పరిణామం జరిగింది.

ఢిల్లీలోని తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్టు చేసింది. ఇప్పటివరకు కవిత ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉంది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవితను ఇటీవల తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు విచారించారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఇటీవల అభియోగాలు మోపింది.. అంతేకాదు కవితకు ఆడిటర్ గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు వాట్సాప్ చాట్ పై దృష్టి పెట్టింది. 100 కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత భూములు కొనుగోలు చేశారని.. ఆ భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధానంగా వినిపించిన పేరు సౌత్ గ్రూప్.. ఆ సౌత్ గ్రూప్, ఆప్ కు మధ్యవర్తిగా కవిత వ్యవహరించారని.. 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో ముఖ్యపాత్ర పోషించారని సిబిఐ అధికారులు అభియోగాలు మోపారు. అవినీతి నిరోధక చట్టం కింద తాము కవితపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐపిసి 120 బి కింద కుట్రకోణం లోనూ ఈ కేసు విచారణ సాగిస్తామని సిబిఐ అధికారులు అంటున్నారు. అందువల్లే తమ కవితను అరెస్టు చేసినట్టు సిబిఐ ప్రకటించింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో కవితను జ్యూడిషియల్ కస్టడీ నుంచి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించింది. శుక్రవారం కోర్టు ఎదుట ప్రవేశపెట్టి.. సిబిఐ అధికారులు కవితను కస్టడీలోకి తీసుకుంటారు.

ఇదే కేసులో కవితను విచారించినందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించిన పిటిషన్ పై విచారణ ఈనెల 16న జరగనుంది. ఇది ఇలా ఉండగానే కవితను సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈ లిక్కర్ స్కాం లో కవితను మార్చి 15న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఆమె తీహార్ జైల్లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఆధీనంలో ఉన్నారు.