Hyderabad : కొత్త శోభ.. ప్రేమ, దయ, సమత.. ఈ మూడింటికి ప్రతీకగా హైదరాబాద్

హైదరాబాద్‌ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవాటిలో చార్మినార్‌ తర్వాత.. నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్‌ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్‌ ప్రత్యేకతల్లో ఒకటి.

Written By: NARESH, Updated On : April 30, 2023 9:19 am
Follow us on

Three idols in Hyderabad : హైదరాబాద్‌ 400 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న నగరం.. ప్రస్తుతం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతోంది. పెట్టుబడులను ఆకర్షిస్తోంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలోనే హైదరాబాద్‌.. ఓ మోడల్‌ సిటీ. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, వాటర్‌ సప్లయ్‌.. పార్కులు, మైదానాలు.. చెరువులు.. బావులు.. ఇలా అన్నీ ఇక్కడ ప్రత్యేకమే. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఇప్పుడు ఓ విశ్వనగరం. కులం, మతం, ప్రాంతం, భాషభేదాలకు అతీతంగా.. అన్నివర్గాల ప్రజలు.. అన్ని రకాల సామాజిక వర్గాలకు కేంద్రం.

తరాల జ్ఞాపకం..
400 ఏళ్ల క్రితమే మోడల్‌ సిటీగా ఉన్న హైదరాబాద్‌ తరతరాలుగా జ్ఞాపకాలను భావి తరాలకు అందిస్తూ వస్తోంది. తరాల మధ్య అంతరానికి ప్రత్యక్ష సాక్షంగా నిలుస్తోంది. ప్రేమ.. దయ.. సమతకు నిదర్శనాలను తన గుండెల్లో భద్రపర్చుకుంటోంది.. ఇందుకు తార్కాణాలుగా నిలిచాయి.. చార్‌మినార్‌.. బుద్ధ విగ్రహం.. తాజాగా అంబేద్కర్‌ విగ్రహం.

చార్మినార్‌.. చరిత్ర

చార్మినార్‌ను సుల్తాన్‌ మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా 1591లో నిర్మించారు. ఈ చతురస్రాకార నిర్మాణం నాలుగు స్తంభాలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అతని భార్య భాగమతి గౌరవార్థం నిర్మించబడిందని చెబుతారు. అయితే చార్మినార్‌ నిర్మాణం వెనుక అసలు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం, చార్మినార్‌ ఆ యుగంలో నగరం మొత్తాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన ప్లేగు వ్యాధి నిర్మూలనను గుర్తించడానికి నిర్మించబడింది. తన ప్రజలు బాధపడుతున్న ఈ ప్లేగు వ్యాధి అంతం కావాలని సుల్తాన్‌ ప్రార్థించాడని నమ్ముతారు. అందువల్ల, ప్లేగు ముగియడంతో, అతను అల్లాకు నివాళిగా చార్మినార్‌ను నిర్మించాడు. నాలుగు స్తంభాలు కూడా ఇస్లాం యొక్క మొదటి నాలుగు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయి. చార్మినార్‌ ఉన్న ప్రదేశం సుల్తాన్‌ తన కాబోయే భార్య భాగమతిని మొదటిసారి చూసిన ప్రదేశం అని కూడా కొందరు నమ్ముతారు. అంటే చార్‌మినార్‌ ప్రేమకు తార్కాణం అని చాలా మంది భావిస్తారు.

బుద్ధ విగ్రహం..
హైదరాబాద్‌ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేవాటిలో చార్మినార్‌ తర్వాత.. నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్‌ సాగర్, అందులోని బుద్ధ విగ్రహం. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్‌ ప్రత్యేకతల్లో ఒకటి. అయితే ఈ విగ్రహం చుట్టూ ఓ విషాద గాధ ఉందని, ఇది హుస్సేన్‌ సాగర్‌ అడుగున రెండేళ్లు ఉందని ఈ తరం వారిలో చాలా మందికి తెలియదు. అప్పట్లో విగ్రహం తరలింపు సమయంలో దీని కింద పడి ఎనిమిది మంది చనిపోయారు. 58 అడుగుల ఎత్తు, 350 టన్నుల బరువు గల ఈ విగ్రహం హుస్సేన్‌ సాగర్‌ మధ్యలో కొలువుదీరడానికి సిద్ధంగా ఉంది. ఆ రోజు బుద్దుడి విగ్రహం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. విగ్రహం 35 అడుగుల లోతున నీటిలో పడిపోయింది. ఆ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారని ద వాషింగ్టన్‌ పోస్ట్‌ 1990లో ‘బుద్ధ ఆఫ్‌ ది లేక్‌ బాటమ్‌’ శీర్షికతో రాసిన ఒక కథనంలో ప్రస్తావించింది.

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని చూసి…
ఆంధ్రప్రదేశ్‌లో 1984లో ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ బుద్ధ విగ్రహం నెలకొల్పడానికి ఎన్టీఆర్‌ 1984 అమెరికా పర్యటన మూలమని ద వాషింగ్టన్‌ పోస్టు తన కథనంలో తెలిపింది. ఎన్టీఆర్‌ అమెరికాలో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని చూసి అలాంటిదే తన రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. ఆ విగ్రహం న్యూయార్క్‌ నగరంలోని లిబర్టీ ద్వీపంలో 1886వ సంవత్సరంలో ప్రతిష్టించారు. ‘151 అడుగుల ఎత్తులో ఉన్న స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ అమెరికా స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది, నేనూ అలాంటిదే కోరుకున్నాను. అది సమాజానికి నా వంతు సేవగా ఉంటుంది’ అని ఎన్టీఆర్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ కథనం తెలిపింది. బుద్ధు్దడు గొప్ప మానవతా వాది.. దయాగుణానికి నిదర్శనమని, ప్రజలకు సత్యాన్ని బోధించాడని, ఆయన తమకు గర్వకారణమని, అందులోనూ భారతదేశంలో జన్మించాడని ఎన్టీఆర్‌ చెప్పారు.

సమతకు ప్రతీక అంబేద్కర్‌..
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌. బుద్ధుడి మార్గంలో నడిచిన ఆయన సమతకు ప్రతీక. సమ సమాజ భారత దేశమే లక్ష్యంగా ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగం ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా బడుగు, బలహీన వర్గాలు రిజర్వేషన్‌ ఫలాలు అనుభవిస్తున్నారు. ఆయన పొందుపర్చిన ఆర్టికల్‌ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. దేశంలో అన్ని వర్గాలు సమానంగా ఉండాలన్నదే అంబేద్కరుడి ఆలోచన. సమతకు ప్రతీక అయిన అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఈ అత్యంత భారీ విగ్రహం హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో నమోదు అయింది. రానున్న రోజుల్లో చార్‌మినార్, బుద్ధవిగ్రహం తరహాలోనే అంబేద్కర్‌ విగ్రహం కూడా ప్రపంచ స్థాయి టూరిజం స్పాట్‌గా రూపుదిద్దుకోనుంది. ఇలా ప్రేమ, దయ, సమతకు ప్రతీకగా విశ్వనగరం వర్ధిల్లబోతోంది.