Telangana HYDRA
Telangana HYDRA : హైడ్రా కూల్చివేతలతో బాధితులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు అనుమతులు ఇచ్చారని.. తాము పైసా పైసా కూడబెట్టుకొని ఆ స్థలాలు కొనుగోలు చేశామని.. బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో ఇళ్లను నిర్మించుకున్నామని.. ఇప్పుడు బఫర్ జోన్ పరిధి, ఎఫ్ టీ ఎల్ అంటూ కూల్చివేయడం ఎంతవరకు న్యాయమని బాధితులు వాపోతున్నారు. తామంతా మధ్యతరగతి వారమని.. తమ ఇళ్లను కూలగొడితే ఎక్కడికి పోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే వారి ఆవేదనను ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి సామాజిక మాధ్యమాల వేదికగా బయటపడుతోంది.
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బాధితుల ఆవేదనను తెలియజేస్తున్నారు . ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని అమీన్ పూర్ చెరువు ను ఆక్రమించి కట్టిన భవనాలను హైడ్రా పడగొట్టింది. ఈ సమయంలో ఆ ఇళ్లను పడగొడుతుంటే వాటి యజమానుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. అయితే ఇందులో ఓ చిన్నారి చెబుతున్న మాటలు హృదయాలను కదిలించాయి. ” మా ఇంటిని రేవంత్ రెడ్డి కూలగొట్టించారు. మాకు ఉండడానికి ఇల్లు లేదు. నా పుస్తకాలు కూడా అందులోనే పోయాయి. చాలా బాధగా ఉందని” ఓ చిన్నారి వ్యాఖ్యానించిన తీరు బాధను కలిగిస్తోంది. ఇళ్లు కోల్పోయిన బాధితుల బాధ ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంది.
గుండెల పిండేసే ఈ చిన్నారి వీడియో
కేటీఆర్ నిప్పులు
హైడ్రా పేరుతో కూల్చివేతలపై కేటీఆర్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ రాక్షస పాలనకు ఇది నిదర్శనం అని చెబుతున్నారు. ఓటు వేసి గెలిపించిన పాపానికి ప్రజలకు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్లను కూలగొట్టే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేటీఆర్ కు చాలా మంది నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. ” మీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు. ఎల్ఆర్ఎస్ అనే స్కీం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. దాని పర్యవసనాలను రాజధాని నగర ప్రజలు అనుభవిస్తున్నారని చెబుతున్నారు. నాడు సక్రమంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వారు వివరిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ ను పడగొట్టకుండా ఉండేందుకు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని.. తన స్నేహితుడి ఫామ్ హౌస్ అని చెబుతున్న కేటీఆర్.. దాని విషయంలో ఎందుకు అంత తొందర పడ్డారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రేవంత్ మంచి ప్రయత్నం చేస్తున్నారని.. మంచి చేస్తున్నప్పుడు ఇలాంటి అవరోధాలు తప్పవని నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం “రేవంత్ సార్ ఇంత దారుణంగా ఉండొద్దు.. సామాన్యుల కలల్ని కూలిస్తే ఏమొస్తది.. ఆ పేదల బాధలను చూసైనా ఆలోచించాలని” సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.