KTR Apologized : అడుసు తొక్కనేల.. కాలు కడగనేల.. తెలంగాణ మహిళలకు కేటీఆర్‌ క్షమాపణ.. !

తెలంగాణలో అధికారం కోల్పోయాక.. బీఆర్‌ఎస్‌ నేతల్లో అసహనం పెరుగుతోంది. అధికార కాంగ్రెస్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నారు. త్వరలోనే ప్రభుత్వం కూలుతుందన్నందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 16, 2024 12:23 pm

KTR Apologized

Follow us on

KTR Apologized : తెలంగాణలో 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌ నేతృత్తంలోని బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌స్‌ ఓడిపోయింది. కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ 65 సీట్లతో అధికారం చేపట్టింది. ఇక అధికారం కోల్పోయిన నెలకే బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని మాట్లాడడం మొదలెట్టారు. కేటీఆర్, హరీశ్‌రావు సైతం ఇదే జపించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి క్యూ కట్టారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఇప్పుడు ప్రభుత్వాన్ని, రేవంత్‌ను విమర్శించమే లక్ష్యంగా నోటి దురుసు ప్రవర్తిస్తున్నారు. దీంతో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలా దురసుగా మాట్లాడినందుకే బీఆర్‌ఎస్‌ను ప్రజలు గద్దె దించారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా గులాబీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. తమ పాలనలో ఏతప్పు చేయలేదని చెప్పుకునేందుకు, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉల్లిపాయలు తీసుకోవడానికి, గోరింటాకు పెట్టుకోవడానికి మాత్రమే ఉచిత ప్రయాణం పనికొస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యగ్యంగా మాట్లాడారు. బస్సుల్లో బ్రేక్‌ డాన్స్‌ లు, రికార్డింగ్‌ డాన్స్‌ లు చేసుకోవచ్చు అని కేటీఆర్‌ అత్యంత జుగుప్సకరంగా వ్యాఖ్యానించారు.

మండిపడ్డ సీతక్క..
మహిళలను ఉద్దేశించి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్‌ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీతక్క మాట్లాడుతూ ‘‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్‌?. ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్‌ డాన్స్‌లు చేస్తున్నారా?. మీ బుర్రలో ఉన్న బురదకు నిదర్శనం ఈ వ్యాఖ్యలు. గత పది సంవత్సరాలు హైదరాబాద్‌లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్‌ డాన్సులు ఎంకరేజ్‌ చేసిన చరిత్ర మీది. మహిళలు ఆర్థికంగా ఎదగాలని మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నాం. అందులో భాగంగా పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నాం. గుమ్మడికాయ దొంగలు అంటే కేటీఆర్‌ భుజాలు తడుముకోవడం ఎందుకు?. ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన మీకు రాలేదు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు మీకు నచ్చవు. మేం చేస్తే దాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణాలు చేసేవాళ్లు తప్పుడు పనులు చేస్తున్నారన్నట్టుగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. శ్రమజీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటి?. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే… వారిని బ్రేక్‌ డాన్స్‌ లు వేసుకోమనడం దుర్మార్గం. కేటీఆర్‌ క్షమాపణలు చెప్పాల్సిందే’ అని డిమాండ్‌ చేశారు.

క్షమాపణ చెప్పిన కేటీఆర్‌..
మంత్రుల డిమాండ్‌తోపాటు, కేటీఆర్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. మహిళలను కించపర్చేలా మాట్లాడడాన్ని తప్పు పడుతున్నారు. గతంలో కవితను అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా అన్నందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన నేతలు.. ఇప్పుడు తెలంగాణ మహిళలను కించపర్చడం ఏంటని మండిపడుతున్నారు. అధికారంలో లేకపోవడంతో ఏం మాట్లాడుతున్నామని కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. దీంతో నష్టాన్ని గుర్తించిన కేటీఆర్‌.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను మహిళలను కించపర్చాలని చేయలేదని, తన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. తద్వారా వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, ట్రోలింగ్‌ ఆగుతుందా లేదా అనేది చూడాలి.