BRS Vs Congress: తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రోజుకో తీరుగా మారిపోతున్నాయి. మొన్నటిదాకా అల్లు అర్జున్ వివాదం సంచలనం సృష్టించగా.. ఇప్పుడు “ఫార్ములా ఈ” కేసు కలకలం రేపుతోంది. పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు 55 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి విదేశీ కంపెనీకి బదలాయించడాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ విషయాన్ని క్యాబినెట్లో కూడా చర్చించలేదు. నేరుగా డబ్బును విదేశీ కంపెనీకి పంపించారు. దీనివల్ల కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసులోకి ప్రవేశించాయి. మొత్తంగా ఏసీబీ (anti corruption bureau), ఈడి (enforcement directorate) రంగంలోకి దిగాయి. ఫలితంగా ఈ కేసు కొత్త మలుపులు తీసుకుంటున్నది. పైగా హైకోర్టు కూడా ఈ కేసు విచారణలో తాము ఏమీ చేయలేమని.. దర్యాప్తు సంస్థలు విచారణ చేపడితే అడ్డుకోబోమని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో కేటీఆర్ ను మరింత లోతుగా కార్నర్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఒకప్పుడు కేసీఆర్ బాధితుడు కాబట్టి.. నాడు తన కూతురు పెళ్లికి ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు కాబట్టి.. పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు.
మధ్యలో ల్యాండ్ క్రూయిజర్
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉప్పు నిప్పులాగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇంతలోనే ల్యాండ్ క్రూయిజర్(land cruiser) ఇందులోకి ప్రవేశించింది. అయితే దీనికి దానికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా.. ఆగండి ఆగండి అక్కడిదాకే వస్తున్నాం.. ముందే మనం చెప్పుకున్నాం కదా రాజకీయాలు ఒకప్పటిలాగా లేవని.. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను అడ్డంగా బుక్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి భారత రాష్ట్ర సమితి కూడా తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టింది.
భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించే డాక్టర్ మన్నె క్రిషాంక్ (krishank) సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.. కొడంగల్ లో పలు కాంట్రాక్టులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కే ఎల్ ఎస్ ఆర్ అనే కంపెనీకి కట్టబెట్టిందని.. దానికి ప్రతిగా ఆ కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని ముఖ్యమంత్రికి అందించిందని ఆరోపించారు. ఆ వాహనం నెంబర్ కూడా TS 07 FF 009 అని క్రిషాంక్ పేర్కొన్నారు. కే ఎల్ ఎస్ ఆర్ అనే కంపెనీ 168 కోట్ల కాంట్రాక్టులను పొందిందని క్రిషాంక్ ఆరోపించారు. ఇది క్విడ్ ప్రో కో (quid Pro co) కు బలమైన ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఆ వాహనం ఏదో కాంట్రాక్ట్ కంపెనీ బహుమతిగా ఇచ్చింది కాదని.. ముఖ్యమంత్రి సోదరులు గతంలోని కొనుగోలు చేశారని వివరించింది. దానికి సంబంధించి రవాణా శాఖ జారీ చేసిన ధ్రువపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఫార్ములా ఈ కేసులో రోజుకో తీరుగా సంచలనాలు నమోదు అవుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఇందులోకి ల్యాండ్ క్రూయిజర్ రావడం సరికొత్త చర్చకు దారితీస్తోంది.