https://oktelugu.com/

BRS: పార్లమెంట్ ఎన్నికల ముంగిట.. హైదరాబాద్ గ్రేటర్ “కారు”లో కుదుపులు

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొద్ది రోజుల తేడాతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసేందుకే తాము ముఖ్యమంత్రిని కలిశామని వారు ప్రకటించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 11, 2024 3:53 pm
    BRS
    Follow us on

    BRS: మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగితే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం కారు దూకుడు చూపింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి స్నేహ హస్తం అందించినప్పటికీ.. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రజలు చేతికి హ్యాండ్ ఇచ్చి.. కారుకు జై కొట్టారు. రాజేంద్రనగర్ నుంచి కూకట్పల్లి దాకా గులాబీ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. గ్రేటర్ పరిధిలో తాము చేసిన అభివృద్ధి వల్లే ప్రజలు గెలిపించాలని అప్పట్లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ సత్తా చూపిస్తామని ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే గ్రేటర్ పరిధిలో కారు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటి దూకుడు ఇప్పుడు సన్నగిల్లే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కొద్ది రోజుల తేడాతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు మంజూరు చేసేందుకే తాము ముఖ్యమంత్రిని కలిశామని వారు ప్రకటించారు. కానీ అంతకుముందు మెదక్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహా గానాలు వినిపించాయి. ఆ ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. కొద్దిరోజుల తర్వాత గ్రేటర్ పరిధిలో మేయర్, డిప్యూటీ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్, కొంతమంది కార్పొరేటర్లు గైరాజులయ్యారు. వ్యక్తిగత కారణాలతోనే తాము గైర్హాజరయ్యామని వారు చెప్పినప్పటికీ అసలు వాస్తవం అది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి గైర్హాజరు తో భారత రాష్ట్ర సమితిలో కలకలం చెలరేగింది. తమకు ఇతర పనులు ఉండటం వల్ల ఆ సమావేశానికి రాలేదని వారు చెప్పినప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి చెందిన నేతలు ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే.. వారు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.

    రాష్ట్రంలో పలు మునిసిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఇప్పటివరకు కొనసాగిన భారత రాష్ట్ర సమితి చైర్మన్లు మాజీలు అయిపోతున్నారు. దాదాపు 20 మున్సిపాలిటీలో భారత రాష్ట్ర సమితి కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చి చైర్మన్లను దింపేశారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 20 మున్సిపాలిటీలు చేరాయి. ఇన్ని మున్సిపాలిటీలు తన ఖాతాలో పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఎందుకు వద్దనుకుంటుంది? ఈ క్రమంలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి రేవంత్ రెడ్డిని కలిశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు గతంలో డిప్యూటీ మేయర్ గా పని చేసిన బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఈయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో విస్తృతంగా పనిచేశారు. భారత రాష్ట్ర సమితి అంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో పార్లమెంటు ఎన్నికల్లో నేపథ్యంలో ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడం భారత రాష్ట్ర సమితికి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

    ఇక ప్రస్తుతం అందుతున్న వివరాల ప్రకారం భారత రాష్ట్ర సమితికి చెందిన 56 మంది కార్పొరేటర్లలో 26 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పాట పాడుతున్న నేపథ్యంలో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా చేతిలోకి వెళ్లే అవకాశం కల్పిస్తోంది. మరోవైపు తాము రేవంత్ రెడ్డిని కలిసింది నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే అని మేయర్, డిప్యూటీ మేయర్ చెబుతున్నప్పటికీ అసలు విషయం అది కాదని.. దాని వెనుక పెద్ద కథ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొన్నటిదాకా కేటీఆర్ మాటే శిరోధార్యం అని భావించిన భారత రాష్ట్ర సమితిలో.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలు కారును ఇబ్బంది పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముంగిట కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మరి వీటిని భారత రాష్ట్ర సమితి ఎలా ఎదుర్కొంటుందని ఇప్పుడు అసలు ప్రశ్న.