BRS MLCs In Congress: అర్ధరాత్రి ఆపరేషన్‌ ఆకర్ష్‌.. బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌..!

సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బుధవారం(జూన్‌ 3న) కాంగ్రెస్‌ పెద్దలను కలిసిన సీంఎ, డిప్యూటీ సీఎం, గురువారం(జూన్‌ 4న) ప్రధాని మోదీని కలిశారు.

Written By: Raj Shekar, Updated On : July 5, 2024 9:47 am

BRS MLCs In Congress

Follow us on

BRS MLCs In Congress: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ వేగవంతం చేసింది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీల వంతు వచ్చింది. గురువారం అర్ధరాత్రి చేపట్టిన ఆకర్ష్‌కు బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన దండె విఠల్, భానుప్రసాద్‌రావు, ఎంఎస్‌.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌లోచేరి బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌షాక్‌ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో జాయిన్‌ అయ్యారు.

సీఎం రాకకోసం ఎదురు చూసి..
సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో కలిసి ఢిల్లీ వెళ్లారు. బుధవారం(జూన్‌ 3న) కాంగ్రెస్‌ పెద్దలను కలిసిన సీంఎ, డిప్యూటీ సీఎం, గురువారం(జూన్‌ 4న) ప్రధాని మోదీని కలిశారు. రాత్రి తిరిగి హైదరాబాద్‌ బయల్దేరారు. అప్పటికే ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరేందుకు జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అర్ధరాత్రి హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేంత్‌రెడ్డి నేరుగా క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్సీలకు కండువాలు కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

నెల రోజులు ఆలస్యంగా..
వాస్తవానికి ఎమ్మెల్సీలు నెల క్రితమే కాంగ్రెస్‌లో చేరతారని చర్చ జరిగింది. అనివార్య కారణాలతో ఆలస్యమైంది. వారం రోజులుగా చేరికల కోసం మళ్లీ ప్రయత్నాలు చేశారు. హఠాత్తుగా గురువారం అర్ధరాత్రి సీఎం సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నెలలో బడ్జెట్‌ సమావేశాలు ఉండడం, మరోవైపు శుక్రవారం(జూన్‌ 5న) అమావాస్య, తర్వాత రోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి హడావుడిగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు.

12కు పెరిగిన కాంగ్రెస్‌ బలం..
ఇదిలా ఉంటే.. మండలిలో కాంగ్రెస్‌కు 6 ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్‌ బలం 12కు పెరిగింది. కాంగ్రెస్‌లో చేరికకు ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోట్‌ల్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.