BRS Vs Congress : గతంలో భారతీయ జనతా పార్టీ మీద ఒంటి కాలు మీద లేచే కేసిఆర్.. అకస్మాత్తుగా తన రూటు మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని చిక్కి శల్యం చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ మీద విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నాలుగు భారీ బహిరంగ సభల్లోనూ ఆయన ఇదే ధోరణి ప్రదర్శించారు. బిజెపిని వదులుకొని కాంగ్రెస్ మీద కేసీఆర్ పడేందుకు ప్రధాన కారణం.. తెలంగాణలో ఆ పార్టీ క్రమంగా బలం పెంచుకోవడమే.. కాంగ్రెస్ లో కెసిఆర్ కోవర్టులు ఉన్నప్పటికీ.. ఆ పార్టీ బలంగా కనిపిస్తోందంటే దానికి ప్రధాన కారణం కర్ణాటకలో సాధించిన విజయం.. ఇక తాజాగా కెసిఆర్ మాటలను నిజం చేస్తూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వీరి దారిలోనే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
చర్చల నుంచి చేరికలు దాకా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడుగులు చర్చల నుంచి చేరికల దిశగా పడుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ని కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుండగా.. తాజాగా భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గత రాష్ట్ర సమితికి షాక్ ఇస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్న దామోదర్ రెడ్డి గత కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధిష్టానం తోనూ, రేవంత్ రెడ్డితోనూ జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటికి బలం చేకూర్చుతూ టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మల్లు రవి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ కొనరేకీకరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ దామోదర్ రెడ్డిని మల్లు రవి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరుతానని దామోదర్ రెడ్డి తన అంతరంగీకులతో చెబుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
నాగం జనార్దన్ రెడ్డిని కలిసే అవకాశం
దామోదర్ రెడ్డి నాగర్ కర్నూల్ సీటు ఆశిస్తున్న నేపథ్యంలో అదే నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డిని కూడా ఒకటి లేదా రెండు రోజుల్లో కలిసే అవకాశం కనిపిస్తోంది. ఈ సీటుకు సంబంధించి స్పష్టత రాగానే దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. అని కూడా మల్లు రవితో చర్చలు జరిపారు. ఇది జరిగిన తర్వాత కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు, టిపిసిసి సభ్యుడు చింతలపల్లి జగదీశ్వరరావు ను హైదరాబాదులోని ఆయన నివాసంలో జూపల్లి కలిశారు. మూడు సంవత్సరాలుగా కొల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీకి జగదీశ్వర్ రావు పెద్దదిక్కుగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, దామోదర్ రెడ్డి, కృష్ణారావు గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వం లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. దామోదర్ రెడ్డి కూడా తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రారంభించారు. 2006లో మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మన్గా పని చేశారు. 2018 ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఘర్ వాపసి ప్రారంభమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి కూడా మల్లు రవిని కలిశారు. ఇక అన్ని కుదిరితే జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన చేరికకు సంబంధించి ఈనెల 12వ తేదీ తర్వాత స్వయంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.