MLA Mahipal Reddy: అక్రమాల: ‘గూడెం’.. తవ్వేకొద్ది అక్రమాలే!

మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి మనీ లాండరింగ్, హవాలా మార్గాల్లో అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : June 22, 2024 11:09 am

MLA Mahipal Reddy

Follow us on

MLA Mahipal Reddy: మోదీ వస్తే ఈడీ వస్తుంది.. ఎన్నికల సమయంలోనే ఈడీ దాడులు చేస్తుంది.. విపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది.. ఇదీ ఆరునెలల క్రితం వరకు బీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐపై, కేంద్రంపై చేసిన ఆరోపణలు. కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. మోదీ రాష్ట్రానికి రాలేదు.. కానీ ఈడీ వచ్చింది. కారణం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డి మైనింగ్‌ పేరుతో చేసిన అక్రమాల గుట్టు తేల్చబోతోంది. అక్రమ మైనింగ్‌తో ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం నష్టం కలిగించారు. ఈ లెక్క తేల్చేందుకు ఈడీ మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితోపాటు బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై గురువారం(జూన్‌ 20న) దాడులు చేసింది.

తవ్వేకొద్దీ అక్రమాలే..
ఇక మొదట రూ.39 కోట్ల అక్రమాలు జరిగాయని ఈడీ భావించగా, దాడుల తర్వాత ఈడీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. పత్రాలు, కంప్యూటర్లు, రికార్డులు పరిశీలించిన తర్వాత రూ.300 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. సంతోష్‌ సాండ్, సంతోష్‌ గ్రానైట్‌ కంపెనీల ద్వారా ఈ అక్రమాలు కొనసాగించారని ఈడీ పేర్కొంది. ఇక ఈడీ దాడుల సమయంలో రూ.19 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాడుల వివరాలతో ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మనీలాండరింగ్, హవాలా..
మహిపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి మనీ లాండరింగ్, హవాలా మార్గాల్లో అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమ మార్గంలో పెద్దమొత్తంలో డబ్బును స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ వెల్లడించింది. ఇంకా కొన్ని బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని తెలిపింది.

బినామీల పేరుతో అక్రమాలు..
ఇక గుడెం బ్రదర్స్‌ అక్రమ దందాలను బినామీల పేరిట చేసినట్లు ఈడీ గుర్తించింది. వారి వివరాలు సేకరించే పనిలో కూడా ఈడీ ఉంది. తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకే పలువురు బినామీల పేరిట వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించారు. బినామీల ఖాతాలు, ఇళ్లలోనూ సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వెనకేసుకొచ్చిన హరీశ్‌..
ఇదిలా ఉంటే.. గూడెం సోదరులను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు వెనకేసుకొచ్చారు. తమ ఎమ్మెల్యే ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈడీ కక్షపూరితంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. ఐటీ చెల్లిస్తూనే వ్యాపారం చేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, ఈడీ అధికారికంగా పడ్డుకున్న డబ్బులు, గుర్తించిన అక్రమాల వివరాలను వెల్లడించింది. అయినా హరీశ్‌రావు తమ ఎమ్మెల్యేను వెనకేసుకురావడం గమనార్హం.